ఇప్పటికే పలు సాంకేతిక విభాగాల్లో దూసుకుపోతున్న చైనా మరో ముందడుగు వేసింది. ఎక్కడో ఒకచోట ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన ముడి చమురును మరో చోటకు తరలించి అక్కడి ప్లాంట్‌లలో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, సహజవాయువుతో పాటు పెట్రోల్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇదంతా చేయడానికి భూమిపై ఓ పెద్ద స్థాయిలో ప్లాంట్లు ఉంటాయి. ముడి చమురు ధరకంటే దానిని రవాణా చేయడానికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని చైనా తన వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సముద్రంలోని షిప్పులోనే శుద్ది చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ షిప్పులోని ప్లాంట్ ముడి చమురును సహజవాయువుగా మార్చి దానిని ద్రవీభవింపజేసి స్టోర్ చేసుకుంటుంది. దీనికి చైనా పెట్టిన పేరు NGUYA FLNG.
చైనాలో తయారైన ఈ ఫ్లోటింగ్ రిఫైనరీ ప్లాంట్ ఇటలీకి చెందిన ప్రముఖ ఎనర్జీ కంపెనీ ప్రాజెక్టు కోసం చైనా నుంచి కాంగో రిపబ్లిక్‌కు ప్రయాణం సాగించింది. కాంగో తీరజలాల్లో దీనిని లంగరువేశారు.
NGUYA FLNG ప్రత్యేకతలు
చైనాలో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద తేలియాడే ఎల్‌ఎన్‌జీ షిప్ ఇదే. సహజ వాయువును ద్రవీభవింపజేసి, నిల్వచేసి రవాణా చేయడానికి ఈ ఫ్లోటింగ్ ప్లాంట్ ఉపయోగపడుతుంది. భూమిమీద ఒక చోట స్థిరంగా ఉండే ప్లాంట్ల కంటే ఈ తరహా తేలియాడే సదుపాయాలు సముద్రంలోనే ఉత్పత్తి నుంచి రవాణా వరకు పనులను సులభతరం చేస్తాయి. ఆఫ్రికాదేశంలోని కాంగోలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశం. అక్కడ విస్తారంగా లభించే సహజవాయువును అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేయడానికి ఇటలీకి చెందిన ఎనర్జీ కంపెనీ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నది. దీనికి చైనాలో తయారైన NGUYA FLNG ను కాంగోలో ఏర్పాటు చేశారు. తద్వారా కాంగో ఆర్థిక వ్యవస్థ కొంతవరకు బలపడుతుంది. ఆఫ్రికాలో సేకరించిన ముడి చమురును యూరప్ దేశాలకు వెళ్లేలోగానే శుద్ధిచేసి సహజవాయువుగా మార్చి ద్రవీకరిస్తారు. తద్వారా నేరుగా శుద్ధి చేసిన సహజవాయువు కంపెనీలకు సరఫరా అవుతుంది.
ప్రపంచానికి ఉన్న ప్రాధాన్యం
ప్రపంచంలో ఈ తరహా టెక్నాలజీతో ఫ్లోటింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన మొదటి దేశం చైనా కావడం విశేషం. చైనా ఇంజనీరింగ్ రంగంలో తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. ఇటలీ కంపెనీతో చైనా ఒప్పందం చేసుకోవడంతో చైనా, యూరప్, ఆఫ్రికా దేశాల మధ్య ఎనర్జీ సహకారానికి కొత్త మార్గాలను సృష్టించినట్టు అవుతుంది. రాబోయో రోజుల్లో ఇలాంటి తెలియాడే ప్లాంట్లు కీలకపాత్రను పోషిస్తాయనడంలో సందేహం లేదు.