చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆరాధకుడు హనుమంతుడు. ఆయన చేసిన సాహసాలను చూసి ఆశ్చర్యపోతాం. ఆహా ఓహో అంటూ చప్పట్లు కొడతాం. రామాయణంలో హనుమంతుడి పాత్రను గాథలుగా చెప్పుకుంటూ సంతోషిస్తారు. ఆయనలా ధైర్యంగా ఉండాలని, ఆయనలా సాహాసాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. హనుమంతుడి చూసిన వెంటనే మనకు తెలియకుండానే మనలో ఓ విధమైన ధైర్యం కలుగుతుంది. హనుమంతుడి శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆయన తోక కూడా అంతే బలంగా ఉంటుంది. ఎందరో అతి భయంకరమైన రాక్షసులను తన వాలంతో చుట్టూ అవతల పడేస్తాడు. రామధూతగా లంకకు వెళ్లిన హనుమంతుడు తన తోకను చుట్టి అందరికంటే ఎత్తులో కూర్చుంటాడు. అంతెందుకు మహాభారతంలో భీముడు వంటి బలాడ్యుడు కూడా హనుమంతుడి తోకను ఎత్తలేకపోతాడు. అంతటి బలమైన హనుమంతుని తోకకు ప్రతి ఒక్కరు తప్పని సరిగా నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన రుద్ర వీర్య సంభవుడు. రుద్రాంశ సంభూతుడు. అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని అర్ధం. హనుమంతుడిలో అర్ధనారీశ్వర తత్వంతో కూడుకొని ఉంటుంది.
నశివేన వినా దేవి అంటే ఈశ్వరుడు లేకుండా ఈశ్వరి లేదు. దేవ్యాచ వినా శివః అంటాం. అంటే శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు. ఎక్కడ ఈశ్వరుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు. శివాంశ సంభూతుడిగా హనుమంతుడు జన్మించినపుడు ఆ అమ్మ జగదాంబ పార్వతీదేవి తన శక్తి ఆంజనేయుని వాలంలో నిక్షిప్తం చేసింది. అందుకే హనుమంతుడి వాలానికి గంటను కడతారు. స్వామివారికి వాలపూజ పేరుతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే హనుమంతుడి చిత్రపటంలోని తోకభాగానికి 24 రోజులపాటు క్రమం తప్పకుండా బొట్టుపెడుతూ హనుమంతుని మహామంత్రంతో పూజ చేస్తారు. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని భక్తులు నమ్ముతారు. హనుమత్ వాలపూజను నియమంతో, సంకల్పంతో, నిష్టతో సాధన చేయాలి. కాబట్టి మనం కూడా హనుమ ఆలయానికి వెళ్లినపుడు లేదా ఇంట్లో హనుమంతుడిని పూజించే సమయంలో ఆయన పాదాలతో పాటు వాలానికి కూడా పూజ చేద్దాం. భజరంగబలి అనుగ్రహాన్ని పొందుదాం.