తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవంబర్ 17న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అమ్మవారికి వాహన సేవలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తుల సందడి, మంగళవాద్యాలు, పూలతో అలంకరించిన వీధులు పుణ్యక్షేత్రానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
శుక్రవారం ఉదయం అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని ఊరేగించగా, భక్తులు నామస్మరణలతో వీధులన్నీ మార్మోగించేశారు. సాయంత్రం గజవాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. నవంబర్ 22న ఉదయం సర్వభూపాల వాహనంపై అమ్మవారు విరాజిల్లగా, రాత్రి భక్తుల ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే గరుడవాహన సేవ నిర్వహించనున్నారు.
తిరుమలలో శ్రీనివాసుడికి జరుగే గరుడసేవ ఎంత వైభవంగా ఉంటుందో, తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి గరుడవాహన సేవ కూడా అంతే ఆద్యాత్మికంగా, భక్తి జ్వాలలతో నిండుగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ, తిరుచానూరు పట్టణం మేళతాళాలతో మార్మోగుతోంది.