గ్రహదోషాలు నివారణ కోసం యాగాలు పూజలు చేస్తుంటాం. అదే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆసుపత్రులకు పరిగెత్తుతుంటాం. అయితే, కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కొన్ని దేవాలయాలు కూడా ఉపయోగపడుతుంటాయి. గతంలో మనం మధుమేహాన్ని నివారించే ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. అటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయం. ఇది కంటి సమస్యలను నివారించే ఆలయంగా ప్రసిద్ది పొందింది. ఈ ఆలయం ఎక్కడ ఉంది. విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దృష్టి సమస్యల నివారణ ఆలయం పేరు వెల్లీశ్వరర్ ఆలయం.
తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్‌లో ఉంది. ఇక్కడ మహాశివుడు వెల్లీశ్వరర్‌గా ప్రసిద్ధి పొందాడు. తమ కంటి సమస్యల గురించి స్వామివారికి చెప్పుకొని భక్తితో ప్రార్థిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆ విశ్వాసంతోనే భక్తులు వెల్లీశ్వరర్ ఆలయానికి వస్తుంటారు. తమ బాధలను ఆయనతో చెప్పుకుంటారు. ఇలా ఎందరి భక్తుల బాధలనో ఆ పరమేశ్వరుడు తొలగించినట్టుగా భక్తులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని మనసారా ప్రార్థించి నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారు. పువ్వులను సమర్పిస్తారు. స్వామివారికి బిల్వదళాలు, గంగాజలంతో అభిషేకిస్తారు. భక్తితో నిజాయితీతో చేసే పూజలు తప్పకుండా ఫలిస్తాయి.
కంటి సమస్యలు ఎన్నింటినో ఆ స్వామి తీర్చినట్టుగా భక్తులు చెబుతున్నారు. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే చాలని, తప్పకుండా కోలుకుంటారని నమ్మకం. ఒకవేళ వైద్య చికిత్స చేయించుకున్నా… ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకునేందుకు కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ మహాశివుడు వెల్లీశ్వరర్ స్వామి రూపంలో పూజలు అందుకుంటే అమ్మ పరమేశ్వరి కామకాశి అమ్మాన్ పేరుతో పూజలు అందుకుంటుంది. ఈ ఆలయాన్ని శుక్ర స్థలంగా చెబుతారు. నవగ్రహాల్లో ఒకటైన శుక్రగ్రహంతో ఈ ఆలయం ముడిపడి ఉంటుంది.
కేవలం కంటికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, ప్రేమ, సంబంధాలు, సృజనాత్మకత, సంపదకు సంబంధించిన ప్రతికూలతను తొలగించే ఆలయంగా కూడా వెల్లీశ్వరర్ దేవాలయం ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో అత్యద్భుతమైన శిల్పాలతో నిర్మించబడింది. ఈ ఆలయంలో వెల్లీశ్వరర్, కామకాశి అమ్మాన్తోపాటు ఆయన కుటుంబ దేవతలైన గణపతి, మురుగన్‌లు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తిన సమయంలో జరిగిన సంఘటన కారణంగా తన దృష్టిని కోల్పోతాడు. ఆ దుఃఖం నుంచి బయటపడేందుకు ఆయన మహాశివుడిని ప్రార్థిస్తాడు. ఇప్పుడు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలోనే శుక్రాచార్యుడు మహాశివుడి గురించి తపస్సు చేశారని, ఆ తపస్సు ఫలితంగానే తన చూపు తిరిగి వచ్చిందని కథనం. ఆ కారణంగానే ఇక్కడ స్వామివారు వెల్లీశ్వరర్‌గా వెలిశారని చెబుతారు. వెల్లీ అంటే శుక్రుడు అని, ఈశ్వర్ మహాశివుడు అని అర్థం. ఈ విధంగా వెల్లీశ్వరర్ రూపంలో ఉన్న మహాశివుడు భక్తుల కంటికి సంబంధించిన ఇబ్బందులను తొలగిస్తూ వారి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్నాడు.