నందీశ్వరుడు లేని శివాలయం దాదాపు కనిపించదు. ఆలయం చిన్నది కావొచ్చు పెద్దది కావొచ్చు. నందీశ్వరుడు లేకుండా శివుడు దర్శనం ఇవ్వడు. కానీ, ఈ ఆలయం దానికి విరుద్దంగా నంది లేకుండా ఉంటుంది. అనంతపురం జిల్లా అమరాపురం హైమవతి గ్రామంలో సిద్దేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివాలయంలో నంది కనిపించదు. శివుడు ఉగ్రమూర్తిగా ఉంటాడు. దక్షయజ్ఞం జరిగిన సమయంలో నంది తోడుగా వెళ్లిన సతీదేవి ఆ యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకోవడంతో శివుడు ఉగ్రరూపుడై తాండవం చేస్తాడు. ఆ ఉగ్రరూపంలో ఉన్న శివుడే సిద్దేశ్వరాలయంలో దర్శనం ఇస్తాడు. అందుకే ఇక్కడ శివుడికి ఎదురుగా నంది ఉండదని పండితులు చెబుతున్నారు. ఇది అత్యంత అరుదైన శివాలయంగా పేరుగాంచింది.
నందీశ్వరుడు శివుడికి మహాభక్తుడు. నంది లేకుండా మహాశివుడు కైలాసం నుంచి బయటకు కదలడని అంటారు. అటువంటి మహాశివుడు నంది లేకుండా ఉగ్రరూపంలో దర్శనం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మహాశివుని అవతారాలైన నటరాజస్వామి, దక్షిణామూర్తి ఆలయాల్లోనూ మనకు నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక శివలింగం ఎక్కడ ఉన్నా సరే… దాని ముందు నంది ఉండి తీరాల్సిందే. నంది లేకుండా ఆలయం కనిపించదు. కానీ, అనంతపురంలోని సిద్దేశ్వర ఆలయం వీటన్నింటికీ భిన్నమని చెప్పాలి. ఇక్కడ ఉగ్రరూపంలో ఉండే స్వామివారిని దర్శించుకుంటే కుటుంబంలో వచ్చే సమస్యలు తీరిపోతాయని అంటారు.