పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజి సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. ముఖ్య నటీనటుల క్యారెక్టర్ పోస్టర్స్ ను వరుసగా రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.
ఈరోజు మేకర్స్, నటుడు ప్రకాశ్ రాజ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆయన సత్యదాదా పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్ ను బట్టి చూస్తే గ్యాంగ్‌స్టర్ లా కనిపించే ఈ రోల్ పవర్‌ఫుల్‌గా, డిఫరెంట్‌గా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే ఈ పోస్టర్ రిలీజ్‌తో మరోసారి చర్చ మొదలైంది – పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే “ఆర్ట్ వేరు, ఆర్టిస్ట్ వేరు” అనే తత్వాన్ని మళ్లీ నిరూపించాడని. ఎందుకంటే రాజకీయంగా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగానే ఉంటారు. పవన్ సనాతన ధర్మం గురించి చెప్పిన విషయాలు, ప్రధాని మోడీకి ఆయన ఇచ్చిన మద్దతుపై ప్రకాశ్ రాజ్ బహిరంగంగానే విమర్శిస్తూనే ఉంటారు.
కానీ వాటిని పక్కన పెట్టి ఆయన నటనకు గౌరవం ఇస్తూ, ఓజి లాంటి పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చారు పవన్. ఇదే కాకుండా గతంలో వకీల్ సాబ్ సినిమాకి కూడా పవన్, ప్రకాశ్ రాజ్‌ని తీసుకున్నారు. అప్పట్లో కూడా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ సెట్ మీద అవి ఎక్కడా రాలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.
ప్రకాశ్ రాజ్ లాంటి వెర్సటైల్ యాక్టర్ ఒక సినిమాలో ఉండటం అనేది ఆ సినిమాకే అదనపు బలాన్ని ఇస్తుంది. ఆయన ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఉండటంతో, ఓజి సినిమాలో నటించడం ఒక రకంగా రీఎంట్రీ లాంటిదే అని చెప్పొచ్చు.
మొత్తానికి సత్యదాదా పోస్టర్ విడుదలతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. రాజకీయంగా విభేదాలు ఉన్నా, కళను గౌరవించడం పవన్ కళ్యాణ్ స్టైల్ అని మరోసారి చాటి చెప్పింది ఈ కలయిక.