మన దేశంలో తొలిసారి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) ప్రారంభమైంది అన్న సంగతి తెలిసిందే కదా… ఈ లీగ్ ఉద్దేశం భారతదేశంలో విలువిద్యను ప్రోత్సహించడం, అలాగే మన ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం కల్పించడం. మొత్తం ఆరు జట్లు, 48 మంది విలువిద్యాకారులు ఇందులో పోటీ పడతారు— అందులో 36 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉంటారు.

ఇక ఈ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా హీరో రామ్ చరణ్ హాజరయ్యాడు. ఆయనే ఈ లీగ్ కి బ్రాండ్ అంబాసడర్. విలువిద్య మన భారతీయ చరిత్రలో, సంస్కృతిలో ఉన్న ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ, RRR సినిమాలో తాను విలువిద్యాకారుడిగా నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.

https://www.instagram.com/p/DPqyDDdDyqC/?img_index=5
శనివారం రామ్ చరణ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో కలిశాడు. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేస్తూ, క్రీడల పట్ల ప్రధాని చూపిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపాడు. “ప్రపంచంలో తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం సందర్భంగా మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలవడం గౌరవంగా ఉంది. మోదీ గారి మార్గదర్శనం, క్రీడల పట్ల ఉన్న అభిరుచి విలువిద్య వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతుంది. అన్ని ఆటగాళ్లకు అభినందనలు. మరెందరో యువత ఈ క్రీడలో చేరి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాం,” అని రామ్ చరణ్ రాశాడు.

ఈ భేటీతో దేశంలో క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం చూపుతున్న దృష్టి మరింత స్పష్టమైంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ యువ క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. భవిష్యత్తులో భారతదేశం అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో బలమైన స్థానం సంపాదించాలన్నదే ఈ లీగ్ లక్ష్యం.

ప్రొఫెషనల్ ఫ్రంట్లో, రామ్ చరణ్ ప్రస్తుతం పుణేలో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమాలో పాట షూట్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా ప్రారంభించబోతున్నాడు.