సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ నటించిన ‘సికందర్’ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ విడుదలైన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పెద్ద ప్రభావం చూపలేకపోయింది. భారీ స్థాయిలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇటీవల తన కొత్త సినిమా ‘మాధరాసి’ ప్రమోషన్స్ సమయంలో దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఈ విషయంపై స్పందించారు. సికందర్ షూటింగ్ సమయంలో సల్మాన్‌కు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయని, అందుకే కఠినమైన భద్రతా పరిమితుల్లో షూట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. రాత్రి 9 గంటల తర్వాతే షూట్ చేయడానికి అనుమతి ఉండేదని, ఎక్కువ భాగం ఇండోర్స్‌లోనే తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అలాగే, సల్మాన్ తరచుగా లేట్‌గా సెట్‌కి రావడం వల్ల టీమ్ రాత్రంతా షూట్ చేయాల్సి వచ్చిందని, దాంతో చాలా భాగం విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డామని మురుగదాస్ చెప్పారు. అంతేకాక, స్క్రిప్ట్‌లో పదేపదే జోక్యం జరిగిందని, అందుకే సినిమా చేయడం చాలా కష్టమైందని వివరించారు.
ఇప్పటివరకు సల్మాన్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. కానీ బిగ్ బాస్ 19 తాజా ఎపిసోడ్‌లో చివరికి ఆయన తన సిగ్నేచర్ హ్యూమర్, సర్కాస్టిక్ టోన్‌తో స్పందించారు.

కామెడియన్ రవి గుప్తా ఆయనను తన కెరీర్‌లోని చెత్త సినిమాలు ఏవో చెప్పమని అడగగా, సల్మాన్ ‘సూర్యవంశీ’ ఇంకా ‘సికందర్’ పేర్లు చెప్పి, ప్రేక్షకులు తిరస్కరించినప్పటికీ కథ మాత్రం కొత్తదని అన్నారు. అదే సమయంలో మురుగదాస్ వ్యాఖ్యలపై సరదాగా పంచ్ వేశారు. తాను లేట్‌గా రావడానికి కారణం నిర్లక్ష్యం కాదని, ఆరోగ్య సమస్యలేనని స్పష్టం చేశారు.
అంతేకాక, మురుగదాస్ కొత్త సినిమా ‘మధరాసి’ గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ, “చాలా పెద్ద సినిమా… అంతే పెద్ద బ్లాక్‌బస్టర్ కూడా!” అని చమత్కరించారు. చివరగా సికందర్ సినిమా మొదట మురుగదాస్ మరియు నిర్మాతకే సంబంధించినదని, కానీ తర్వాత ఇద్దరూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలిపారు.
ఇలా సల్మాన్ తన స్టైల్‌లోనే మురుగదాస్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చి మళ్లీ వార్తల్లోకి వచ్చారు!