దోమలు కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడమే కాదు మలేరియా, డెంగ్యూ, చికున్‌గునియా వంటి ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. మార్కెట్లో లభించే కెమికల్ స్ప్రేలు, కాయిల్స్ కొంత వరకు ఉపయోగపడతాయి. వీటిని అధికంగా వినియోగిస్తే ఆరోగ్యానికి చేటు. వీటిపై ఆధారపడకుండా ప్రకృతి మనకు ఇచ్చిన కొన్ని సహజ మొక్కలతో దోమలను సమర్థవంతంగా తరిమికొట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప చెట్టు (Neem) దోమలకు సహజ శత్రువు. ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల దోమలు లోపలికి రావు. వేప ఆకుల చేదు వాసనను దోమలు అస్సలు తట్టుకోలేవు. అందుకే వేప నూనెను అనేక దోమ నివారణ మందుల్లో ఉపయోగిస్తారు.
నిమ్మగడ్డి (Lemongrass) కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మగడ్డి నూనెలో ఉండే సిట్రోనెల్లా ఆయిల్ సహజ దోమ నివారణ ఔషధంగా ప్రసిద్ధి చెందింది. ఇంటి పెరట్లో నిమ్మగడ్డి పెంచుకోవడం లేదా దాని నూనెను వినియోగించడం ద్వారా డెంగ్యూ దోమల నుండి రక్షణ పొందవచ్చు.
రోజ్‌మేరి (Rosemary) కూడా దోమలను పారద్రోలడంలో ప్రత్యేకమైనది. దీని ఆకులు, పువ్వుల ఘాటైన వాసన దోమలకు అస్సలు నచ్చదు. రోజ్‌మేరి పువ్వులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లితే సహజ రక్షణ లభిస్తుంది.
తులసి (Tulsi) కేవలం పవిత్ర మొక్క మాత్రమే కాదు, దోమలకు అడ్డుగోడలా పనిచేస్తుంది. ఇంట్లో తులసి మొక్కలు పెంచడం ద్వారా దోమల దాడి తగ్గుతుంది. అదేకాకుండా తులసి గాలిని శుద్ధి చేస్తుంది, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుండి కూడా కాపాడుతుంది.
పుదీనా (Mint) కూడా సమర్థవంతమైన దోమ నివారణ మొక్క. ఇంటి చుట్టుపక్కల పుదీనా మొక్కలు పెంచితే దోమలతో పాటు చిన్నచిన్న పురుగులు కూడా ఇంట్లోకి రావు. మనుషులకు ఆహ్లాదకరమైన పుదీనా వాసన, కానీ, దోమలకు ఇది భరించలేని వాసన.
వేప, నిమ్మగడ్డి, రోజ్‌మేరి, తులసి, పుదీనా వంటి మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా దోమల దాడిని సహజంగా అడ్డుకోవచ్చు. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతాయి.