దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణించే వాటిల్లో ట్రైన్ ఒకటి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు వివిధ క్లాసుల్లో ట్రైన్స్‌లో ప్రయాణం చేస్తుంటారు. అయితే, సాధారణ జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆధార్ అవసరం లేకున్నా… రిజర్వేషన్ కేటగిరిలో ప్రయాణం చేయాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి. గతంలో ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉంటే చాలు రిజర్వేషన్ లేదా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ, అక్టోబర్ 1 నుంచి రైల్వేశాఖ కీలక మార్పులు చేసింది. ఆధార్ లేకుండా ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోవడం అసాధ్యం. ఆధార్ లేకుండా టికెట్ బుకింగ్ ఉన్న సమయంలో కొందరు ఏజెంట్లు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని, ఒక్కో ఖాతా నుంచి వందలాది టికెట్లు రిజర్వ్ చేసుకొని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ వస్తున్నారు. దీనివలన అవసరం కోసం టికెట్లు బుక్ చేసుకునే వారికి టికెట్లు దొరక్కపోవడం, బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావడంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో అద్భుత శివలింగం…గంగమ్మ ఒడిలో
బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా కేంద్ర రైల్వేశాఖ ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది. లింక్ చేయకుంటే టికెట్ బుక్ అవ్వదు. ఒక అకౌంట్‌పై ఒకటి కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేయవలసి వచ్చినా కూడా తప్పనిసరిగా ఆధార్ లింక్ ఉంటేనే ట్రైన్ టికెట్ బుక్ అవుతుంది. ఆధార్ లేకుండా ఇకపై రిజర్వేషన్‌లో ప్రయాణం చేయడం కుదరదు. ఇది తత్కాల్‌కు తప్పనిసరిగా అనుసరించే అంశం. తత్కాల్ టికెట్లు ఇక నుంచి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అందించనున్నారు. కాగా, సాధారణ రిజర్వేషన్ టికెట్లు ఉదయం 8 గంటల నుంచి చేసుకోవచ్చు. ఆధార్ లింక్ ఉంటే ఉదయం 8 గంటలకు, లింక్ లేకుంటే ఉదయం 8.15 గంటలకు బుకింగ్ సౌకర్యం ఉంటుంది. 15 నిమిషాలు అదనంగా ఆధార్ లింక్ వాళ్లకు కలిసి వస్తుంది కాబట్టి వారికి టికెట్లు లభించే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా టికెట్ల దుర్వినియోగం తగ్గుటుందని, అసలైన ప్రయాణికులకు ప్రాధాన్యత లభిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తున్నది. అయితే, ఆధార్ డేటా ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుందా అంటే కట్టుదిట్టమైన భద్రత ఉందని, వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లదని రైల్వే అధికారులు చెబుతున్నారు.