బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతం తీరప్రాంతాలైన విశాఖ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తున్నది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపైకి వరదనీరు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురుగాలుల కారణంగా చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇక ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి శుక్రవారం తెల్లవారుజాము సమయానికి ఒడిశా-ఉత్తరాంధ్ర తీరంలోని గోపాల్‌పూర్ పరదీప్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది. తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.