పౌరాణిక, జానపద, సాంఘీకం చిత్రం ఏదైనా సరే అందులో NTR ఉన్నాడు అంటే సినిమా బంపర్ హిట్టే. పాత్ర ఏదైనా కావొచ్చు పరకాయ ప్రవేశం చేస్తాడు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలైతే రాముడు, శ్రీకృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, అర్జునుడు, బృహన్నుడు ఇలా రకరకాలైన పాత్రల్లో నటించి మెప్పించాడు. ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నాడు. జానపద చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. రాజుగా, సైనికుడిగా, రాజ్యాధికారిగా, గ్రామస్తుడిగా ఇలా జానపదానికి అవసరమైన పాత్రలన్నింటిలోనూ నటించి శభాష్ అనిపించుకున్నాడు. సాంఘీక చిత్రాలకు కొదవలేదు. ఇన్ని పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ ఓ రెండు పాత్రలను మాత్రం తన జీవితంలో వేయలేకపోయాడు. ఆ రెండు పాత్రలే నారదుడు, హనుమంతుడు. Hanumat Jayanthi వచ్చింది… ఇదే సందర్భం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం.
ఇప్పుడంటే జనరేటర్లు వచ్చాయి. కరెంట్‌తో సంబంధం లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒకవేళ జనరేటర్లు లేకున్నా సోలార్ విద్యుత్‌తో షూటింగ్లు కానిచ్చేస్తున్నారు. కానీ, పూర్వం రోజుల్లో అలా కాదు. కరెంట్ సరిగా ఉండేది కాదు. సినిమా షూటింగ్ మధ్యలో కరెంట్‌పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. మరలా కరెంట్ వచ్చేవరకు అందరూ ఫ్లోర్ బయట కూర్చొని పిచ్చాపాటి ముచ్చట్లు చెప్పుకునేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌తో పాటు మరికొందరు కూర్చొని ఆయన పాత్రల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ మాటల మధ్యలో రావి కొండలరావు కలుగజేసుకొని అన్నా మీరు ఎన్నో పాత్రల్లో నటించారు కదా…నారదముని, హనుమంతుని పాత్రలు ఎందుకని వేయలేకపోయారు. వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నిస్తాడు.
రావి కొండలరావు ప్రశ్న విని అందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఎదురుగా ఉన్న ఎన్టీఆర్. ఆయన్ను ప్రశ్నించడం అంటే ఆరోజుల్లో అందరికీ కొంత భయమే. భయంతో పాటు ఏమనుకుంటారో అనే ఇబ్బంది కూడా. కానీ, రావి కొండలరావు ధైర్యంగా ప్రశ్నించేసరికి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారట. కానీ, ఎన్టీఆర్ కూల్‌గా నవ్వుతూ నారదపాత్ర గురించి ఆలోచించాను బ్రదర్. హస్యం వచ్చేలా… సర్వజ్ఞుడిగా గంభీర్యాన్ని ప్రదర్శించవచ్చు. కానీ, దానికి నా రూపం సహకరించదేమో అనే సందేహంతో ఆగిపోయాను. నారద పాత్ర అంటే ఇలానే ఉంటుందనే ఊహను మనందరం ఇచ్చేశాం. ఆ ఊహను, రూపాన్ని కాదని కొత్త రూపంతో నారదుడు కనిపిస్తే రిసీవ్ చేసుకోవడం కష్టమే అవుతుంది. అందుకే సాహసం ఎందుకులే అని పక్కన పెట్టేశానని చెప్పాడట.
ఇక హనుమంతుడి పాత్ర దగ్గరికి వస్తే… ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకోవాలి. ఫిజికల్‌గా ఎక్కువ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉండాలి. మాస్క్ పెట్టుకొని హావభావాలను పలికించడం కష్టం. పైగా ఫిజికల్ మూవ్‌మెంట్స్‌కు బాడీ సహకరించదు. ఆ పాత్రను చేసి అపహాస్యం కావడం కంటే చేయకుండా ఉండటమే మేలుకదా అని జవాబు ఇచ్చారట అన్న ఎన్టీఆర్. నిజమే కదా. మనకు సూట్‌గాని పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేసి పాత్రలను అపహాస్యం చేయడం కంటే ఆయా పాత్రలకు దూరంగా ఉండటమే మంచిది. ఏ పాత్ర మనకు సెట్ అవుతుందో ఏది కాదో తెలుసుకొని నటించాలి. దొరికాయి కదా అని అన్ని పాత్రల్లో నటించాలని చూస్తే ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పదు. నేటి నటీనటులు ఈవిషయాలను గుర్తుంచుకుంటే చాలు.