ఆదిశంకరులు గృహస్తాశ్రమం నుంచి బాల్యంలో సన్యాసాశ్రమానికి చేరాడు. సన్యాసం స్వీకరించి తన అనుకున్నవారందర్నీ త్యజించి సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరి వెళ్లే సమయంలో కన్న తల్లికి ఓ మాట ఇచ్చినట్టుగా గ్రంథాలు చెబుతున్నాయి. ఆదిశంకరుల తల్లి ఆర్యాంబ తన బిడ్డని దగ్గరకు పిలిచి సన్యాసిగా మారినందుకు బాధపడింది. ఆర్యాంబకు ఏకైక సంతానం ఆదిశంకరులు. ఒక్కగానొక్క కుమారుడు సన్యాసిగా మారితే ఏ తల్లైనా ఎలా చూస్తూ ఊరుకుంటుంది. బాధపడటం తప్పా చేయగలిగింది ఏమీ లేదు. నిర్ణయం తీసుకోవడమే కాదు…సన్యాసం కూడా తీసుకున్నాడు. నిర్ణయం జరిగిపోయిన తరువాత దానిని వెనక్కి తీసుకోవడం కుదరదు. కానీ, తన ప్రయత్నంగా ఆర్యాంబ కుమారుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పుండంటే వయసు ఉన్నది. నాకు నేను చేసుకోగలుగుతాను. కానీ, ఆఖరు క్షణాల్లో నా పరిస్థితి ఏంటి? నాకంటూ ఎవరున్నారు అని ప్రశ్నిస్తుంది.
కుమారుడు దూరంగా వెళ్తున్నప్పుడు ప్రతి తల్లి ప్రశ్నించే ప్రశ్న ఇదే. గొప్ప బిడ్డను కన్నప్పటికీ తల్లి మనసు కుదురుగా ఉండలేదు కదా. మనసులోని దుఃఖాన్ని ఆపుకోలేక శంకరుడి ముందు కక్కేసింది ఆర్యాంబ. అమ్మ మనసును అర్ధం చేసుకున్న ఆదిశంకరులు అమ్మా ఏ సమయమైనా సరే నన్ను తలచుకుంటే చాలు… వెంటనే నీ ముందు ఉంటాను అని ప్రమాణం చేస్తాడు. శంకరుల ప్రమాణం మనలా ఊరికే పోదుకదా. ఒక్కసారి మాట ఇస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. కాలం గిర్రున తిరిగిపోయింది. ఆదిశంకరులు సనాతన ధర్మాన్ని దేశంలోని నాలుగు మూలల ప్రచారం చేస్తూ నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు. గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పినట్టుగా పుట్టిన వాడు గిట్టక తప్పదు కదా. ఎవరూ ఈ భూమిపై శాశ్వతంగా ఉండలేరు. ఆర్యాంబకు కూడా సమయం వచ్చేసింది. భగవంతుడు ఆమెను పిలుస్తున్నాడు.
మరణం ఆసన్నం కావడంతో తన కుమారుడిని కనులారా ఒక్కసారి చూసుకోవాలని అనుకుంది. శంకరులు సన్యాసాశ్రమానికి వెళ్లేముందు చెప్పిన మాటలను అమ్మ తలచుకుంది. తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు… ఇప్పుడు వస్తే బాగుండు అనుకుంటూ కళ్లుమూసుకొని పడుకున్నారు. కళ్లుకూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్నది ఆర్యాంబ. అమ్మ మనసులోని మాటను ఆదిశంకరులు గ్రహించారు. అమ్మను చూడాలని అనుకున్నాడు. వెంటనే ఆదిశంకరులు కృష్ణపరమాత్మను ధ్యానించి, కురు వృద్దుడు భీష్మపితామహుడికి మోక్షం ఇచ్చిన విధంగానే తన తల్లి ఆర్యాంబకు కూడా మోక్షం ఇవ్వాలని అన్నాడు. కన్నయ్య చిరునవ్వు నవ్వి తలూపి వెళ్లిపోయాడు. క్షణక్షణానికి ఆర్యాంబ చూపు మందగించడం మొదలైంది. నోరు తెరిచి మాట్లాడలేని స్థితికి వచ్చేసింది. అయ్యో శంకరుడు ఇంకా రాలేదే అనుకుంటుండగా ఎవరో వస్తున్న అలికిడి అయింది. లోపలికి వచ్చిన ఓ పసిబాలుడిని చూసి శంకరుడే అనుకొని ప్రాణాలను కూడగట్టుకొని లేచి కూర్చొని మనసారా హత్తుకున్నది.
బాలుడి శరీరంపై ఆభరణాలు ఉండటం గమనించిన ఆర్యాంబ… శంకరుడు సన్యాసి కదా… ఈ బాలుడి శరీరంపై ఆభరణాలు ఉన్నాయేంటి… వచ్చింది ఎవరూ అనుకుంటూ మూతపడిన కనురెప్పలను భారంగా లేపి చూసింది. ఆ బాలుడిని చూసి ఒక్కసారిగా ఆర్యాంబ ఆశ్చర్యపోయింది. ఎదురుగా ఉంది ఎవరో కాదు…తాను నిత్యం పూజించే గురువాయూర్ శ్రీకృష్ణపరమాత్ముడే. కన్నయ్యను చూసిన అమ్మ… అప్పా అని నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తికూడా లేని స్థితిలో ఉండిపోయాను… నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని ఆప్యాయంగా అడుగుతుంది. ఇది శంకుడి ఆదేశం అమ్మ. ఆయన ఆదేశిస్తే రాకుండా ఎలా ఉంటాను అని కన్నయ్య చెబుతాడు. ఆ సమయానికే ఆదిశంకరులు కూడా అక్కడికి వస్తాడు. తన కడుపున జన్మించిన శంకరుడిని, తాను నిత్యం పూజించే కృష్ణభగవానుడిని చూసిన తల్లి ఆర్యాంబ… ఆహా ఏమి నాభాగ్యము… ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అని కన్నీళ్లు కారుస్తుంది. దానికి శంకరుడు చెప్పిన మాటలు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. నేను జన్మించింది మొదలు నీవు నాకోసం పడ్డ శ్రమ, కష్టాలకు బదులుగా నేనేమి చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు. ఎవరైనా అంతే… ఇప్పుడు నేను చేయగలిగినదంతా నీ దివ్యచరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే అని ఆదిశంకులు మాతృమూర్తి ముందు మోకరిల్లుతాడు. భగవంతుడే కన్నతల్లి రుణం తీర్చుకోలేకపోయాడు. మనం ఎంత చెప్పండి. తల్లిదండ్రులను అవసాన దశలో ఓల్డేజ్ హోమ్‌లో వేయకుండా వారికి తమ వద్దే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటే చాలు.