అన్నంటిలోకెల్లా గోక్షీరం అత్యంత శ్రేష్టమైనవి. గోవు నుంచి లభించే సకల ఉత్పత్తులు అమూల్యమైనవే. గోవులో 33 కోట్లమంది దేవీదేవతలు నిశిస్తుంటారు. అయితే, ఎవరు గొప్ప అనే సందేహం కలిగినపుడు బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేసేందుకు అగ్నిలింగేశ్వరునిగా మహాశివుడు అగ్నిస్థంభంగా మారిపోతాడు. బ్రహ్మను చూసి భయపడిన గోవు అబద్దాన్ని నిజం చేసి చెప్పాలని చూస్తుంది. ముఖంతో అవును అని పృష్టభాగంతో లేదు అని చెబుతుంది. సర్వాంతర్యామి అయిన ఆ మహాదేవుడు నిజం ఎరిగి గోవును శపిస్తాడు. నాటి నుంచి గోవు పృష్టభాగాన్నే పూజిస్తూ వస్తున్నాం. బ్రహ్మ ఐదో తనను కాలభైరవుడు తెగ్గొడతాడు. ఇదంతా మనకు తెలిసిన కథ. అయితే, ఈ కథలో గోవుకు శాపం ఉంది. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కథనంలో గోవుకు అత్యంత విశిష్టత ఉంటుంది. గోముఖం నుంచి ఉద్భవించే సహజసిద్దమైన జలధారకు ప్రత్యేకమైన విశిష్ట ఉంది. ఈ ప్రదేశమంటే మహాశివుడికి ఎంతో ప్రీతి అని కూడా చెబుతారు. అంతేకాదు, ఈ కథనంలోని ఆలయం రామాయణం, మహాభారతంతో కూడా ముడిపడి ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గోముఖ జలధార
మహాశివుడికి జలాభిషేకం అన్నా, బిల్వపత్రాలతో అర్చన అన్నా ఎంతో ప్రీతి. పొంగిపోతాడు. ఉప్పొంగిపోయి కావలసిన వరాలన్నీ ఇస్తాడు. కోరికలు తీరుస్తాడు. కోరుకున్నవన్నీ ఇచ్చేస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు అయ్యాడు. అయితే గోవు ముఖం నుంచి ఉద్భవించే జలధారతో అభిషేకం చేస్తే మరింత ఆనందిస్తాడట. మరి ఈ జలధార ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్‌లోని ఆరావళి పర్వత ప్రాంతంలో మౌంట్ అబూ అనే ప్రదేశంలో ఈ గోముఖ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో మహాదేవుడితో పాటు మరో విశిష్టత కూడా ఉంది. ఇక్కడ వశిష్ట మహర్షి యాగం చేసిన స్థలంగా కూడా చెబుతారు. ఈ ఆలయం ప్రాంగణంలో గోవు ఆకృతిలో ఉండే శిల ఉంటుంది. ఈ శిల ముఖభాగం నుంచి సహజంగా ఏర్పడిన జలధార ప్రవహిస్తూ ఉంటుంది.
మౌంట్ అబూ మహాదేవ్ ఆలయం
మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం గురించి తెలియాలంటే మనం మౌంట్ అబూలోని గోముఖ్ మహాదేవ్ ఆలయం వరకు వెళ్లాలి. ఆ ఆలయం రాజస్థాన్‌లోని ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏమంటే ఈ ఆలయాన్ని మహాశివుడితో పాటు వశిష్ట మహర్షికి కూడా అర్పితమైన స్థలం. ఇక్కడ లీల ఏమంటే గోవు ఆకృతిలో ఉండే శిల ముఖభాగం నుంచి ఈ జలధారకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం వంటి పురాణాలతో కూడా ముడిపడి ఉంది. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందు వశిష్ట మహర్షి చేసిన యగ్నం గురించి తెలియాలి. వశిష్ట మహర్షి శక్తివంతమైన అగ్నిహోమాన్ని నిర్వహించిన ప్రసిద్ధమైన స్థలంగా ఈ ప్రదేశాన్ని చెబుతారు. ధర్మరక్షణ కోసం జరిగిన ఈ యాగం నుంచి నాలు శక్తివంతమైన అగ్రికుల రాజపుత్రుల వంశాలు చౌహాన్, సోలంకి, పర్మాన్, ప్రతిహార సృష్టించబడ్డాయని చెబుతారు. ఇప్పటికీ మనం ఈ ఆలయంలో వశిష్టులవారి అగ్నికుండాన్ని ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆవు ముఖాకృతిలో ఉండే శిల నుంచి ప్రవహించే జలధారను కామధేను అని పిలుస్తారు. ఆ కామధేను జలధార కోరికలను తీర్చే దివ్యగంగ, యమునా, సరస్వతి నదుల మూలంగా చెబుతారు. ఈ జలధార అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఈ జలధారలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి.
ఔషధ గుణాల నీరు
అంతేకాదు, ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ నీటిని తీసుకోవడం వలన శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయానికి రామాయణం, మహాభారతానికి అవినాభావ సంబంధం ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, లక్ష్మణుడు వనవాసం సమయంలో వశిష్ట మహర్షి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చినట్టుగా చెబుతారు. అదేవిధంగా ఈ ఆలయం సమీపంలో పాండవ అగ్నికుండం అనే స్థలంలో పాండవులు తమ వనవాసం సమయంలో యాగం చేసినట్టుగా చెబుతారు. ఈ రెండింటి ఆధారంగానే ఈ ఆలయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వశిష్ట మహర్షి విగ్రహాలు ఉంటాయి. ప్రాథమికంగా ఇది మహాదేవుని ఆలయమే అయినప్పటికీ ఇక్కడ వైష్ణవ దేవతల విగ్రహాలు కూడా ఉండటం విశేషం.
అర్బుద సర్పం
మౌంట్ అబూ అంటే రాజస్థాన్ గుర్తుకు వస్తుంది. అయితే, మౌంట్ అబూ పేరు అర్బుద సర్పంతో ముడిపడి ఉంటుంది. వశిష్ట మహర్షి సహాయంతో అర్బుద అనే సర్పం నందివర్ధన పర్వతాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చిందని చెబుతారు. ఈ పర్వతం ఉన్న ప్రాంతాన్ని అర్బుద అడవిగా పిలుస్తారు. ఆ తరువాత కాలంలో అది అబూగా మారింది. ఇక వశిష్ట మహర్షి యాగం చేస్తున్న సమయంలో పలు భూకంపాలు సంభవించినట్టుగా చెబుతారు. ఈ భూకంపాలే గురు శిఖర్ అనే పర్వతం ఏర్పడటానికి కారణమైందని చెబుతున్నారు. ఈ శిఖరం ఆలయానికి సమీపంలో ఉంది. ఈ గోముఖ్ మహాదేవ్ ఆలయం మౌంట్ అబూకి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు 700 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయంలో రామాయణ కాలంనాటి రాముడు, మహాభారత కాలం నాటి శ్రీకృష్ణుడు, వశిష్ట మహర్షి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలతో పాటు ప్రధాన విగ్రహం శివలింగం, నంది విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతాలు ధ్యానం, యోగా కోసం అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. ఈ స్థలాన్ని సాధువులు, యోగులు ఎన్నో శతాబ్దాలుగా ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగిస్తున్నారు.
ఆలయ సందర్శన అనుభవం
ఆధ్యాత్మిక అనుభూతితో గోముఖ్ ఆలయాన్ని సందర్శించాలి. ఆలయంలో గోముఖ జలధార, అగ్నికుండం, విగ్రమాలు భక్తులను ఆకర్షిస్తాయి. అయితే, గోముఖ్ ఆలయాన్ని దర్శించే సమయంలో మెట్లు దిగడం ఓ సవాలు. ఆ ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించవలసి అవసరం లేదు. ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పని సరిగా గైడ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో భాగం గోముఖ్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సమీపంలో నక్కి సరస్సు, దిల్వారా జైన మందిరాలు, అచలేశ్వర మహాదేవ ఆలయం, గురు శిఖర్, అచలగడ్ కోట వంటి ఆకర్షణలు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేశాయి. మౌంట్ అబూని అర్ధకాశి అని పిలుస్తారు. శివుడికి కాశీ ఎంత పవిత్రమైనదో ఈ మౌంట్ అబూ కూడా అంతే పవిత్రమైనదిగా చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉత్తమం. వర్షాకాలం, రాత్రి సమయంలో సందర్శనను నివారించడం మంచిది. టాక్సీలు, జీపులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా హనుమాన్ ఆలయం వరకు చేరుకోవచ్చు. ఆలయాన్ని సందర్శించేవారు సంప్రదాయ దుస్తులు ధరించాలి. చెప్పులు లేకుండా పర్వతాన్ని ఎక్కడం మంచిది. పరిసరాలు శుభ్రంగా ఉంచడం వలన ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువెత్తుతుంది.
చివరిగా
గోముఖ్ మహాదేవ్ ఆలయం కేవలం ఒక ధార్మిక స్థలం మాత్రమే కాదు, ఇది పురాణాలు, చరిత్ర, సహజ సౌందర్యం యొక్క సంగమం. వశిష్ట మహర్షి యాగం, కామధేను జలధార, మహాభారతం, రామాయణాలతో సంబంధం ఈ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తాయి. ఆరావళి అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులకు, పర్యాటకులకు శాంతి, దివ్య అనుభవాన్ని అందిస్తుంది.