మంచి ఎవరు చెప్పినా మంచే అనుకోవాలి. మంచి చెప్పేవారిని ఎప్పుడూ మనం అనుసరిస్తూనే ఉండాలి. సలహాలు సూచనలు తీసుకోవాలి. అయితే, ఈ కాలంలో మనకు మంచి చెప్పేవారికంటే చెడు చేసేవారే ఎక్కువ. అందుకే పూర్వకాలంలో మనకు మంచి జరిగే విధంగా మంచిమాటలు చెప్పిన వారిని అనుసరిస్తూ ఉంటాం. వారు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ ఉంటాం. సమయం గురించి, సమయ పాలన గురించి ఎందరో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అటువంటి వారిలో విదురుడు కూడా ఒకరు. విదురుడు చెప్పిన మంచి మాటలను విదురనీతి పేరుతో పిలుస్తారు. సమయం దాని విలువ గురించి విదురుడు చెప్పిన వాటిని తప్పకుండా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి. సమయం గురించి విదురుడు చెప్పిన సత్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలః క్రీడతి గచ్చతి అంటే కాలమే రాజు అని అర్ధం. కాలం ఎప్పుడూ కూడా తన పనిని తాను చేస్తూనే ఉంటుంది. అది ఎక్కడా ఎన్నడూ ఆగదు. మనం తడబడతామేమోగాని కాలం మాత్రం పనిచేయడం మానదు. దీని నుంచి మనం తెలుసుకోవలసింది ఏమంటే సమయాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఎన్నడూ వృథా చేకుకోకూడదు. బుద్ధిగా కాలాన్ని వినియోగించుకోవాలి. న కాలః సోపేక్షణీయః అంటే కాలాన్ని నిర్లక్ష్యం చేయరాదు. సమయం ఒక సత్యంగా మారే శక్తిగా ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే మన జీవితాన్ని, జీవిత విజయాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. సమయాన్ని గౌరవించనివారు ఎన్నడూ విజయవంతులు కాలేరు. విజయం సాధించాలన్నా, సమయానికి బలికాకుండా ఉండాలన్నా సమయం విలువ తెలుసుకొని ప్రవర్తించాలి.
కృతమపి నిష్పలం భవతి యది కాలో నసమన్వితః అంటే మనకు కావలసిన ఫలితాన్ని ఇవ్వాలంటే సరైన సమయంలోనే పని జరగాలి. సరైన పని చేసినప్పటికీ అది సరైన సమయంలో జరగకుంటే ఫలితం ఉండదు. దీంట్లో ఉన్న సందేశం ఏమంటే కృషి అన్నది సరైన సమయంలో మాత్రమే చేయాలి. విజయానికి సమయం, కృషి రెండు ముఖ్యమైనవే. కాలః పితా వేదానం అంటాం. అంటే కాలం అనేది అత్యంత శ్రేష్టమైన గురువు. మనకు సుఖం, దుఃఖం, విజయం, అపజయం అన్నింటిని బోధించగలదు. దీని నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏమంటే మన జీవితంలోని ప్రతి అనుభవం కాలం ద్వారానే నేర్చుకుంటాం. కాలాన్ని మనం ఎప్పుడూ శతృవుగా చూడకూడదు. గురువుగా మాత్రమే భావించాలి. యదా కాలః తతా కర్తవ్యం అంటే ఏ పని అయినా అనుకూలమైన సమయంలోనే చేయాలి. కాలానికి విరద్ధంగా ఏపని చేయరాదు. ఇలా చేస్తే ఆ పని, శ్రమ వృధా అవుతుంది. దీని నుంచి మనం సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది జ్ఞానవంతుల లక్షణంగా చెప్పబడింది. ఈ ఐదు నీతి సూత్రాలను తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకున్నవి జీవితంలో ఆచరించాలి. ఆచరించినపుడు మనం విజయం సాధిస్తాం.
సమయాన్ని మనం ఎప్పుడూ కూడా విలువైన వస్తువుగానే చూడాలి. పోయిన డబ్బును సంపాదించుకోవచ్చేమోగాని, ద్రవ్యంగా మాత్రం తిరిగిరాదని పండితులు చెబుతున్నారు. ఎప్పుడు ఏ పనిచేయాలో ఆ పనిని వేగంగా చేయాలి. ఆలస్యం చేయకూడదు. ఒకవేళ మనం ఆలస్యంగా పనిని మొదలుపెడితే విజయం కూడా ఆలస్యమౌతుంది. చేతికి వచ్చిన విజయం ఆలస్యమైతే… ఫలితం తగ్గిందనే అనుకోవాలి. ప్రతిరోజును ధర్మానికి, గుణానికి నిచ్చెనగా మాత్రమే వాడుకోవాలి. సమయానికి పనిచేయడం ద్వారా మాత్రమే పనిపట్ల పరిపక్వత వస్తుంది. పరిపక్వత లేని జీవితం వృధానే. కాలం గురించి చివరిగా చెప్పుకోవలసిందేమంటే…కాలం ఎవరినీ కాపాడదు. కాలాన్ని గౌరవించినవారిని మాత్రం అది నిలబెడుతుంది. మహాభారత కాలంలో విదురుడు చెప్పిన మాటలు ఈనాటికీ సమకాలీనంగా ఉంటూ ప్రతి వ్యక్తికి మార్గదర్శిగా నిలుస్తున్నాయి.