హైందవ సంప్రదాయంలో నుదుటిపై తిలకధారణ ఓ పవిత్రమైన ఆచారం. తిలక ధారణ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది రోజువారి తిథి, గ్రహస్థితి, దేవతారాధన వంటి అంశాల ఆధారంగా వివిధ రకాలుగా ఉంటుంది. ప్రామాణికత పంచాంగం ప్రకారం, ఒక్కొక్క రోజు ఒక్కో నిర్ధిష్టమైన దేవతకు అంకితం చేయబడింది. దేవతారాధనకు అనుగుణంగా నుదుటిన తిలకధారణ ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున ఎరుపు రంగులో ఉండే కుంకుమను ధరించాలి. ఇలా చేయడం వలన శారీరక బలంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సోమవారం మహాశివుడిక అంకితం చేయబడిన రోజు కావడంతో ఆరోజన విభూతిని లేదా పసుపును నుదుటిన ధరించాలి. ఇది శాంతిని, ఆయుష్షును ఇస్తుంది.
మంగళవారం సుబ్రహ్మణ్యుడు, హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు కావడంతో ఆరోజున ఎర్రచందనాన్ని నుదుటిన ధరించాలి. శక్తికి, విజయానికి ఎర్రచందనం చిహ్నం. బుధవారం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు కావడంతో ఆరోజున ఆకుపచ్చని కుంకుమ లేదా ఆకుపచ్చని చందనాన్ని ధరించాలి. ఇది బుద్ధిని పెంచడంతో పాటు వాణిజ్యంలో విజయం సాధించేలా చేస్తుంది. గురువారం రోజు గురువులకు అంకింతం చేసిన రోజు. ఆరోజున పసుపు లేదా కుంకుమ కలిపిన పసుపును నుదిటిన ధరించాలి. ఇది జ్ఞానానికి, శుభ ఫలితాలకు చిహ్నంగా ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు ఈరోజున తెల్లని చందనం లేదా పసుపును ధరించాలి. లక్ష్మీదేవి సంపదకు, శాంతికి చిహ్నం. ఇక చివరిగా శనివారం శనీశ్వరుడికి అంకితం చేసిన రోజు. ఆరోజున నీలం చందనాన్ని ధరించాలి. ఇలా చేయడం వలన దోష నివారణ జరుగుతుంది. పట్టుదల, సహనం పెరుగుతాయి.
తిలకధారణ చేసే ముందు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. తిలకం ధరించే ముందు తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తిలకం భ్రూమధ్యభాగంలో పెట్టుకోవాలి. దేవతకు భక్తితో అంకితంగా పెట్టాలి. రోజువారి జప, పూజలో భాగంగా తిలకాన్ని ధరించాలి. కొన్ని సందర్భాల్లో తిలకం రంగు జాతక దోషాలను నివారించేందుకు చిహ్నంగా కూడా చెబుతారు.