మనసుకు నచ్చే వార్తలు లేదా కథనాలు చాలా కొద్దిగా మాత్రమే కనిపిస్తుంటాయి. మానవత్వంతో కూడిన కథనాలు కనిపిస్తే వాటిని తప్పకుండా చదువుతాం. ఫాలో అవుతాం. మనకు అటువంటి అవకాశం వస్తే మనం కూడా ఆచరించి పదిమందికి ఉపయోగపడాలని చూస్తాం. అటువంటి సంఘటన ఒకటి భారతీయ రైల్వేలో చోటు చేసుకుంది. రైల్లో టీ అమ్మే ఓ వ్యక్తి ట్రైన్‌లో తిరిగి తిరిగి అలసిపోయి బోగీలో ఓ సీటు ఖాళీగా ఉంటే అక్కడే కూర్చొని నిద్రపోతాడు.
ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ పోలీసు, టీ అమ్మకం దారుడు నిద్రపోవడం గమనించి అతడిని డిస్ట్రబ్ చేయకుండా అతని టీ కెటిల్‌ను, కప్పులను తీసుకొని వెళ్లి వివిధ బోగీల్లో విక్రయిస్తాడు. కునుకు నుంచి బయటకు వచ్చిన టీ అమ్మకం దారుడు తన కెటిల్ కోసం వెతుక్కుంటూ వెళ్లగా పోలీస్ టీ అమ్మడం గమనించి ఆశ్చర్యపోతాడు. మిగిలిన టీ కెటిల్‌ను, కప్పులను అందించడమే కాకుండా తాను టీ సేల్ చేయగా వచ్చిన మొత్తాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరు మరొకరి పనిని గౌరవించాలి. పని విషయంలో ఎవరూ తక్కువ కాదు. ఎక్కువ కాదు. ఎవరెవరి స్తోమతను అనుసరించి పని దొరుకుతుంది.