మనం పూజించే దేవతలకు మనం పిలుచుకునే నామంతో పాటు మరో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలనే అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర శతనామాలను రాగయుక్తంగా పఠించాలి. రాగయుక్తంగా, శాస్త్రయుక్తంగా పఠించినపుడు ఆ నామాలకున్న శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఆధ్యాత్మిక సాధనకు అష్టోత్తరశతనామాలు ప్రధాన ధ్వారంగా చెబుతారు. ఈ ధ్వారం గుండా లోనికి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ నామావళి పఠించడానికి కొన్ని నియమాలున్నాయి. సమయం, విధానం, శుద్ధత అవసరం. అష్టోత్తర శతనామావళి ఏ సమయంలో పఠించాలి అన్నది కూడా ముఖ్యమైనదే. ప్రభాత సమయంలో అంటే బ్రహ్మముహూర్తంలో అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఇది జ్ఞానానికి, ఉపాసనకు శ్రేష్టమైన సమయంగా చెబుతారు.
దేవాలయంలో నిత్య పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు. అష్టోత్తర శతనామావళిని పఠించే సమయంలో దీపం, నైవేద్యం, పుష్పాలతో కలిపి పఠించాలి. శివుడిని సోమవారం, లక్ష్మీదేవికి శుక్రవారం, శ్రీమహావిష్ణువుకు బుధవారం పఠించాలి. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, నవరాత్రి, శివరాత్రి వంటి పర్యదినాల్లో కూడా పఠించాలి. మంత్రజపం తరువాత నామావళఙతో గానం చేస్తే అది శక్తివంతంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. అష్టోత్తర శతనామావళిని స్నానం చేసిన మాత్రమే చదవాలి. మనసు ఏకాగ్రతతో ఉండాలి. సరైన ఉచ్చరణ ఉండాలి. సాధ్యమైనంత వరకు పుష్పాలతో అర్చించాలని పండితులు చెబుతున్నారు.