రోషన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చాంపియన్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నిన్ననే ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదలైంది. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను అధికారికంగా లాంచ్ చేయడంతో ఈ ఈవెంట్ మరింత ప్రత్యేకంగా మారింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, దేశానికి ఇండిపెండన్స్ వచ్చిన వెంటనే, నిజాం పాలన కొనసాగుతున్న 1948 కాలం నేపథ్యంగా ఈ కథ లోకి తీసుకెళ్లారు. నిజాం అణచివేతకు వ్యతిరేకంగా మొదటిగా తిరుగుబాటు చేసిన గ్రామాల్లో ఒకటైన బైరన్‌పల్లి గ్రామం ఈ కథకు కేంద్రబిందువుగా నిలుస్తుంది.
అలాంటి కల్లోల కాలంలో, ఫుట్‌బాల్‌లో గొప్ప స్థాయికి చేరాలని కలలు కనే ఓ యువకుడు, తన వ్యక్తిగత ఆశలకంటే తన నేల కోసం పోరాడటమే నిజమైన లక్ష్యమని గ్రహిస్తాడు. కలలకూ, న్యాయం కోసం చేసే పోరాటానికీ మధ్య నిలబడి, ఒక నిజమైన చాంపియన్ గా నిలుస్తాడు.
దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ పీరియడ్ కథను అత్యంత నిజాయితీతో తెరకెక్కించాడు. 1948 నాటి నిజాం ప్రాంతపు వాతావరణం, దుస్తులు, జీవన శైలి—ప్రతి అంశానికీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. క్రీడలు, పోరాటం, తిరుగుబాటు అన్న అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ, అదే సమయంలో కల్లోలంలో పుట్టే ఓ అందమైన ప్రేమకథను కూడా సహజంగా నెరపారు.
రోషన్ ఈ చిత్రంలో తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాడు. క్రీడాకారుడి నుంచి తిరుగుబాటుదారుడిగా మారే పాత్రను ఆయన పూర్తిగా తనలోకి తీసుకున్నాడు. శారీరక మార్పు నుంచి భావోద్వేగాల వరకు ప్రతిదీ సహజంగా చూపిస్తూ, తన నటనా సామర్థ్యాన్ని చాటాడు.
తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా పలకడం ఈ పాత్రకు పెద్ద సవాలే అయినా, రోషన్ ఆ పరీక్షను ధైర్యంగా అధిగమించాడు.
ఆ గ్రామ యువతిగా అనస్వర రాజన్ ఎంతో అందంగా కనిపిస్తుంది. మహిళలకు ఎదగడానికి అవకాశం లేని సమాజంలో స్వేచ్ఛ, అభివృద్ధి కోసం కలలు కనే అమ్మాయిగా ఆమె పాత్ర మనసును తాకుతుంది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర కూడా ముఖ్యమైనదే…
ఇప్పటికే చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించిన మిక్కీ జే మేయర్, ఈ ట్రైలర్‌కు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉత్కంఠను, ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఈ సినిమా 25th డిసెంబర్ క్రిస్మస్ సందర్బంగా రిలీజ్ అవుతుంది!