రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణమే గుర్తుకు వస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని ఎందరో కవులు, రచయితలు వివిధ రకాలైన రామాయణాలు, ఉపాఖ్యానాలు, కథనాలు రచించారు. ఇప్పటికీ రచిస్తూనే ఉన్నారు. రామాయణం అంటే మనకు సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, రావణుడు వంటివారే గుర్తుకు వస్తారు. కానీ, రామాయణంలో ఎన్నో పాత్రలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆ పాత్ర కనిపించేది కొంత సమయమే అయినప్పటికీ ప్రాముఖ్యత పరంగా తీసుకుంటే ఎంతో గొప్పగా కనిపిస్తుంది. నిడివి కాదు నిబద్దత ముఖ్యమని, అంతర్లీనంగా చెప్పబడిన అంశాలు ముఖ్యమని మనకు తెలియజేస్తుంది. ఇటువంటి గొప్ప పాత్రల్లో ఒకటి ఊర్మిళ పాత్ర. జనకమహారాజు కుమార్తెగా, సీతాదేవి సోదరిగా, లక్ష్మణుడి భార్యగా కనిపించే ఈ పాత్ర రామాయణంలోని అయోధ్యకాండలో మాత్రమే మనకు కనిపిస్తుంది. అందులోనూ వాల్మీకి అయోధ్యకాండలోని ఒకచోట మాత్రమే ప్రస్తావించారు. వాల్మీకి ప్రస్తావించింది ఒక్కచోటే అయినప్పటికీ ఆ పాత్రను వివరంగా విశ్లేషిస్తే ఆమె జీవితం అనేక ప్రశ్నలతో, భావోద్వేగాలతో మిగిలిపోతుంది. ఊర్మిళ పాత్రను ప్రాచీన ఇతిహాసాల్లో అనేక ఉప కథనాలు, కథలు, కవితల రూపంలో వర్ణించారు.
మిథిలా నగరంలో జనకమహారాజు కుమార్తె యువరాణిగా ఉండే అర్హత ఉన్నప్పటికీ భూమిజగా పేరుగాంచిన సీతాదేవి కోసం తన జీవితానన్ని త్యాగం చేసింది. అక్క ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉండాలని, అక్క వెంబడే నడిచిన ఊర్మిళ లక్ష్మణుడిని వివాహం చేసుకుంది. పుట్టినింట అక్కను అనుసరించిన ఊర్మిళ మెట్టినింట కూడా ఆ కుటుంబానికి పేరు తెచ్చే విధంగా, తన కుటుంబం శ్రేయస్సును కోరుకునే మహిళగా నిలిచింది. ఈరోజుల్లో తాను తన భర్తే ఉండాలని కోరుకునే మహిళలు ఊర్మిళ నుంచి ఎంతో నేర్చుకోవాలి. అన్నను సేవించడం సోదరుల ప్రధాన కర్తవ్యం. లక్ష్మణుడు ఈ ధర్మాన్ని పాటించాడు. అన్నతో పాటు అన్న భార్యకు రక్షణగా ఉండటం కూడా సోదరుల విధి. దీన్ని కూడా లక్ష్మణుడు సమర్థవంతంగా నిర్వహించాడు. వనవాసంలో 14 సంవత్సరాల పాటు నిద్రపోకుండా ఆహారానికి దూరంగా ఉంటూ అన్న, వదినల సేవలో మునిగిపోయాడు. అటువంటి లక్ష్మణుడికి భార్యగా ఊర్మిళ తన వంతు సేవ చేసింది.
అన్నావదినల సేవ చేసేందుకు వనవాసానికి వెళ్తున్నట్టుగా లక్ష్మణుడు చెప్పగా ఊర్మిళ ఎంతగానో సంతోషించింది. భర్త సేవ ఒక విధమైన ధర్మం అయితే, అతడి ధర్మాన్ని అంగీకరించడం తన కర్తవ్యం అని భావించింది. లక్ష్మణుడి కోసం 14 సంవత్సరాల పాటు ప్రతిరోజూ తపస్సు చేస్తూ, దైవ కృప కోసం ప్రార్థిస్తూ కాలం గడిపింది. తన జీవితాన్ని ధైర్యంగా, ఆత్మనిబ్బరంతో గడిపింది. వనవాసం సమయంలో సీతారామ లక్ష్మణులకు ఎదుదైన ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ, ధైర్యంతో ముందుకు అడుగులు వేశారు అంటే దాని వెనుక ఊర్మిళ తపశ్శక్తి కూడా ఉందని అర్ధం చేసుకోవాలి. ధర్మబద్ధమైన సేవను భర్త చేస్తాను అంటే దానికి ప్రతి భార్య కూడా అంగీకరించాలి. నేను, నా భర్త, నా పిల్లలు అనుకోకుండా ధర్మంవైపుకు, ధర్మబద్ధమైన పనుల వైపుకు అడుగులు వేస్తే జీవితం ఎంతో ఆనందంగా, చిరకాలం నిలిచిపోయేలా ఉంటుంది. కుటుంబంలో కలహాలకు తావుండదు.