దేవాలయాలను నిర్మించే క్రమంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తారు శిల్పులు. ఆలయ నిర్మాణంలో ప్రధానంగా గోపురం, సింహద్వారం, బలిపీఠం, ధ్వజస్తంభం, గర్భగుడి, క్షేత్రపాలకుడు తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకుండా ఆలయాలను నిర్మిస్తే వాటిని అసంపూర్తి ఆలయాలుగానే భావిస్తారు. అసంపూర్ణంగా ఉండే ఆలయాలకు దైవిక శక్తులు తక్కువగా ఉంటాయని, ప్రభావం కూడా తక్కువే ఉంటుందని అంటారు. ఆలయం చిన్నదైనా పెద్దదైనా కావొచ్చు. కానీ, ఆగమ, శిల్పశాస్త్రంలో పేర్కొన్న విధంగానే ఆలయాలను నిర్మించాలని వేదపండితులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణ శాస్త్రం గురించి చెప్పుకోవాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. ఆగమ శాస్త్రంలో నిర్మాణం గురించిన విషయాలు, వాస్తు, శిల్పశాస్త్రంలో చెప్పిన విషయాలను మనం ఓ సీరిస్‌గా నడుపుకుందాం. ఈ వ్యాసంలో మనం కేవలం ఆలయాల సింహద్వారం గురించి మాత్రమే చెప్పుకుందాం. అసలు ఆలయాల్లో సింహద్వారాన్ని ఎందుకు నిర్మిస్తారు. దీని వలన కలిగే ప్రయోజనాలేంటి. ఆధ్యాత్మికంగా ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సింహం తలల ప్రతిమలతో అలంకరించబడిన ప్రధాన ద్వారాన్ని సింహద్వారమని పిలుస్తారు. పూర్వకాలం నుంచి దేవాలయాల ప్రధాన ద్వారం వద్ద సింహాల శిల్పాలను, చిత్రాలను ఉంచడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. వీటి ఆధారంగానే ప్రధాన ద్వారాన్ని సింహద్వారంగా పిలుస్తారు. సింహం ద్వారం ముందు సింహాల ప్రతిమలను ఎందుకు ఉంచుతారు అనే దానిపై పలు కథనాలున్నాయి. శక్తికి, ధైర్యానికి, అధికారానికి సింహం ప్రతీక. దుష్ట శక్తుల నుంచి దేవాలయాన్ని సింహం కాపాడుతుంది. శ్రీమహావిష్ణువు సింహావతారమై నరసింహావతారం వలన కూడా సింహానికి పవిత్రత పెరిగింది. ఆగమశాస్త్రాలు, వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారం కేవలం నిర్మాణశైలి మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీకగా కూడా చెబుతారు. దేవాలయ ప్రవేశిక ద్వారం వద్ద సింహం శిల్పాలు ఉండటం వలన ప్రతికూల శక్తులు లోపలికి రావని ప్రధాన నమ్మకం.
ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం సింహద్వారం అసలు రహస్యం ఏమంటే ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తుల్లో ఉండే అహంకారాన్ని, దుష్టభావాలను ప్రవేశ ద్వారం వద్దనే వదిలేయాలని దానికి సూచిక. అలా వదిలేకుండా లోనికి ప్రవేశిస్తే సింహం మనల్ని భయపెడుతుంది. భౌతికమైన ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక లోకానికి ప్రవేశిస్తున్నారని చెప్పడానికి సింహద్వారమే చిహ్నం. సింహం ప్రతిమలు ఉన్న ద్వారా ఎక్కువగా ఉత్తర, తూర్పుదిశల్లోనే ఉంటాయి. ఈ దిశలు శుభప్రదమైన దిశలుగా చెబుతారు. ఈ దిశల నుంచి లోనికి ప్రవేశిస్తే అంతా శుభమే జరుగుతుందని భావిస్తాం. చివరిగా చెప్పాలంటే సింహద్వారం అనేది కేవలం నిర్మాణశైలి మాత్రమే కాదు. ధర్మరక్షణ, ఆధ్యాత్మిక మార్గదర్శంతో పాటు శుద్ధికి కూడా సంకేతంగా చెబుతారు. ఆలయంలోని ప్రధాన మూర్తిని దర్శనం చేసుకునే ముందు మనస్సు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడమే ఈ సింహద్వార రహస్యం. మానవభాషలో చెప్పాలంటే ఏమున్నా బయటే వదిలేయాలి. లోపలికి తెల్లని పేపర్ మాదిరిగా రావాలి. గుడి వద్దకు వెళ్లగానే తోసుకొని పరిగెత్తకుండా సింహద్వారం ముందు ఒక్కనిమిషం ఆగి కళ్లుమూసుకొని మనలోని మాలిన్యాలను అక్కడే విదిలేస్తున్నట్టుగా భావన చేసి లోపలికి అడుగుపెట్టాలి.