పిల్లలకు హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ఆయన్ను చూస్తుంటే చాలు ఆనందంతో పరవశించిపోతారు. అటువంటి హనుమంతుడు గాంభీర్వ వదనంతో, నమస్కార ముద్రలో కనిపిస్తే ఇంకెంత బాగుంటుంది. అందులోనూ శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన నారసింహునికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తున్నట్టుగా ఉంటే.. ఆహా ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే మనసు పులకించిపోతుంది. కన్నులారా దర్శించుకుంటే ఇంకెంత బాగుంటుందో చెప్పలేం. ఇలాంటి దృశ్యాన్ని మనం చూడాలంటే తమిళనాడులోని నామక్కల్ జిల్లా నామక్కల్ పట్టణానికి వెళ్లాలి. అక్కడే హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తైన శివశిలతో తయారు చేసిన విగ్రహం మనకు కనిపిస్తుంది. హనుమాన్ ఉపాసకులు ఎక్కువగా దర్శించుకునే ఆలయాల్లో నామక్కల్ హనుమాన్ ఆలయం కూడా ఒకటి.
హనుమంతుడు నారసింహుడికి నమస్కరించడం వెనుక పురాణ గాథ ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి వరం పొందిన తరువాత ముల్లోకాలను ఇబ్బంది పెడుతుంటాడు. శ్రీహరి భక్తులను హింసిస్తుంటాడు. ఇంద్రుడిని తరిమేసి ఆ లోకాన్ని ఆక్రమించుకుంటాడు. హిరణ్యకశిపుడు నుంచి రక్షించాలని మునులు, దేవతలు, ఋషులు వెళ్లి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకుంటారు. రాక్షసుడి కుమారుడైన ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడిగా మారిపోవడం, అతడిని శ్రీహరి భక్తి నుంచి తప్పించేందుకు స్థంభాన్ని బద్దలు కొట్టడం జరగుతుంది. ఆ స్థంభం నుంచి నారసింహుడు ఉద్భవించి సంధ్యాసమయంలో భూమి, ఆకాశానికి మధ్యలో తన కాలిపై పడుకోబెట్టి సంహరిస్తాడు. హిరణ్యకశిపుడి సంహారం నామక్కల్ ప్రాంతంలోనే జరిగిందని విశ్వాసం.
ఇక వైకుంఠం నుంచి వచ్చిన నారాయణుడిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుంది. ఆ సమయంలోనే వాయుపుత్రుడైన హనుమంతుడు గండకీ నది నుంచి సాలిగ్రామాన్ని తీసుకొని వస్తుండగా, మార్గమధ్యలో లక్ష్మీదేవిని చూసి ఆమెకు సాలిగ్రామ శిలను ఇస్తాడు. ఆ సాలిగ్రామాన్ని లక్ష్మీదేవి కాసేపటి తరువాత కింద పెడుతుంది. అంతే ఆ సాలిగ్రామం కాస్త పెద్ద కొండగా మారుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటన్న నామక్కల్ పేరు అలా వచ్చిందే. హిరణ్యకశిపుడిని సంహరించిన నారసింహుడిని ఇతోధికంగా పూజిస్తారు. శిలను తీసుకొచ్చిన హనుమంతుడు నమస్కార ముద్రలో మనం దర్శనం చేసుకోవచ్చు.
ఇక్కడ కొండలోని గుహలో నారసింహుడికి ఆలయం ఉంటుంది. లక్ష్మీదేవి సాలిగ్రామాన్ని కిందపెట్టడంతో కొండగా మారుతుంది. ఆ తరువాత హనుమంతుడు వచ్చి ఆ కొండను చూసి నమస్కరించాడని, ఆనాడు ఆయన నమస్కరించిన విధంగానే నేడు గోపురం లేకుండా 18 అడుగుల ఎత్తులో శివశిలతో విగ్రహం రూపంలో మనకు దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. అయితే, ఆంజనేయుడికి పైన గోపురం నిర్మించకపోవడం వెనుక పలు కారణాలున్నాయి. స్వామివారి విగ్రహం కొద్ది కొద్దిగా పెరుగుతోందని, అందుకే పైన గోపురాన్ని ఏర్పాటు చేయలేదని అంటారు. ప్రతి మంగళ, శనివారాల్లో స్వామివారికి వడమాలను ధరింపజేస్తారు. ఆ సమయంలో జరిగే పూజలను చూసేందుకు రెండుకళ్లు చాలవు. ఇక హనుమాన్ విగ్రహాన్ని తమిళ పంచాంగ శిల్పశైలిలో చెక్కినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 5 నుంచి 8 వ శతాబ్దాల మధ్య నిర్మించి ఉంటారని భక్తులు చెబుతున్నారు.
ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు నాలుగు రకాలైన పూజలు నిర్వహిస్తారు. కల సంధ్య, ఉచికాల, సాయరక్ష, అర్థరాత్రి సమయంలో నిర్వహించే పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో 15 రోజులపాటు పంగుణి ఉతిరం అనే పండుగను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో నిర్వహించే రథయాత్రను చూసితీరాల్సిందే.
ఈ ఆలయానికి రైలు, రోడ్, ఎయిర్ మార్గాల ద్వారా సులభంగా చేరవచ్చు. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో నామక్కల్ రైల్వేస్టేషన్ ఉంది. ఇక సేలం, ఈరోడ్, త్రిచ్చి, చెన్నై, కోయంబత్తూర్ నుంచి నామక్కల్‌కు రైలు సదుపాయం అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల నుంచి నామక్కల్‌కు రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. ఇకపోతే, త్రిచ్చి, సేలం విమానాశ్రయాల నుంచి కూడా నామక్కల్‌కు చేరుకోవచ్చు. నామక్కల్ బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. హనుమత్ ఉపాసకులు హనుమాన్ భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి.