నేపాల్ అంటే గుర్తుకు వచ్చేది హిమాలయాలు, ఎత్తైన కొండలు, ప్రశాంత వాతావరణం, అంతకు మించి పశుపతినాథ్ దేవాలయం. మహాశివుని భక్తులకు పశుపతినాథ్ అలయం అత్యంత పవిత్రమైన ఆలయం. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే రుద్రాక్షలను తీసుకొని భద్రంగా దాచుకుంటారు. ప్రస్తుతం హిమాలయ పర్వత ప్రాంతాల మధ్య చల్లగా ఉన్న దేశంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలి ఇప్పటికే రాజీనామా చేశారు. మంత్రులు సైతం రాజీనామాలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసంతో సహా పలు భవనాలకు ఆందోళన కారులు నిప్పు అంటించారు.
ఇదంతా ఒకెత్తైతే, ఇప్పుడు అందరీలోనూ ఒకటే చర్చ నడుస్తున్నది. రాజధాని కాఠ్మండులో ఉన్న పశుపతినాథ్ ఆలయం ఎంత వరకు భద్రంగా ఉంది అన్నదే ప్రశ్న. ఆందోళన కారులు ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ ఆలయం చుట్టూ పెద్ద సంఖ్యలో ఆర్మి డిప్లాయ్ కావడంతో వెనుదిరిగినట్టుగా తెలుస్తోంది. నేపాల్ పూర్తిగా హిందూ దేశం. ఇటువంటి హిందూ దేశంలో మహాశివుని ఆలయాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనలు సహజంగా రావు. హింసలో భాగంగా రగిలిన ఉద్రేకంతో ఆలయాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచన రావొచ్చు. ఒకవేళ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే… భగవంతుని ఆగ్రహ జ్వాలలకు బలికావలసి వస్తుంది. మహాశివుని ఆగ్రహం అంటే మూడో కన్ను తెరిచినట్టే కదా. అయితే, ఆలయం భద్రంగానే ఉందని అక్కడి నుంచి వస్తున్న కథనాలు, వీడియోలు చూసి భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.