సమావేశంలో ముఖ్య అంశాలు:
•జాబితా సవరించి న్యాయం చేయాలి
•మన్యం జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
ఇనాం భూములు, డీకేటీ పట్టాలు ఉన్న రైతులకు కూడా అన్నదాతా సుఖీభవ వర్తింప చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి రైతుకీ సాయం అందాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, వండువ గ్రామ పరిధిలో ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు అన్నదాతా సుఖీభవ పథకం వర్తించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

వండువ గ్రామ పరిధిలో 653 మంది రైతులు ఇనాం భూములు సాగు చేసుకుంటుండగా, వారికి అన్నదాతా సుఖీభవ సాయం అందలేదు. ఈ విషయాన్ని పాలకొండ శాసన సభ్యులు శ్రీ జయ కృష్ణ గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంపై తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్… సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.