టీవీకే పార్టీ అధినేత విజయ్ సెప్టెంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తరువాత విజయ్ మహాబలిపురం సమీపంలోని ఓ లగ్జరి రిసార్ట్స్‌లో బాధిత కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. 37 కుటుంబాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. బాధిత కుటుంబాలను కరూర్ వెళ్లి పరామర్శించడానికి తనకు అవకాశం లభించలేదని, ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోందని, కేసు పెండింగ్ కారణంగానే తాను బాధిత కుటుంబాలను కలవలేకపోయినట్టు తెలిపారు.
బాధిత కుటుంబానికి తన తరపున ఇప్పటికే సాయంగా రూ. 20 లక్షల రూపాయలను అందజేసినట్టు తెలియజేశారు. భవిష్యత్తులో కుటుంబాలకు అయ్యే వైద్య ఖర్చులు, ఉపాధి, జీవనోపాధికి అవసరమైన భరోసాను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా ఇలా ఉన్నా… ఈ భేటీకి రిసార్ట్‌ను వేదికగా ఎంచుకోవడం పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు బాధితులను గౌరవంగా ఆహ్వానించేందుకు మెరుగైన సౌకర్యాలతో కూడిన రిసార్ట్‌లో సమావేశం అయ్యారని కొందరు భావిస్తే, ప్రజల మధ్య ప్రజలతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత కలిగిన నాయకులు ఇలా రిసార్ట్స్‌లో ఆర్భాటంగా సమావేశం నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుండగా, మద్రాస్ హైకోర్టు గత ఘటనల్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 రోజుల్లోపుగా పబ్లిక్ ర్యాలీ / భారీ సభల కోసం తప్పనిసరి భద్రత ప్రోటోకాల్స్‌ను రూపొందించి అమలు చేయాలని ఆదేశించింది. చనిపోయిన కుటుంబాల న్యాయం, భవిష్యత్తులో ఇటువంటి ప్రాణనష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన తక్షణ బాధ్యత ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంపై ఉందని కోర్టు స్పష్టం చేసింది.