మహిళలు చేతికి తప్పని సరిగా గాజులు ధరిస్తారు. ఇది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి బారతీయ స్త్రీ గాజులు ధరించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, చేతికి ఇలా గాజులు ధరించడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటి? చేతికి ఎలాంటి గాజులు ధరించాలి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ సందేహాలకు సమాధానాలు వెతికే పనిచేద్దాం. ఈరోజుల్లో చాలా మంది చేతికి బంగారు గాజులను ధరిస్తున్నారు. రెండు చేతులకు ఒక్కొక్కటి లేదా రెండు రెండు బంగారు గాజులు ధరించడం పరిపాటిగా మారింది. అయితే, చేతికి బంగారు గాజులు ధరించినప్పటికీ తప్పనిసరిగా ఒక్కో చేతికి కనీసం రెండు మట్టి గాజులు ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. చేతికి ఈ మట్టి గాజులు వేసుకునే ముందు తప్పనిసరిగా అమ్మవారి ముందు ఉంచి వాటికి పసుపు, కుంకుమతో పూజించాలి. అలా పూజించిన గాజులను మాత్రమే చేతికి ధరించాలని, ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినపుడు కుంకుమతో పాటు గాజులు కూడా ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాదు, సోదరి ఇంటికి వెళ్లే సమయంలో అన్నా లేదా తమ్ముడు తప్పనిసరిగా గాజులు తీసుకొని వెళ్లాలని, అది తన ఐదో తనాన్ని గౌరవించినట్టు అవుతుందని, నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉండాలని ఆశీర్వదించినట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు. చేతికి నిండుగా మట్టిగాజులు వేసుకున్న మహిళలను సమాజం గౌరవిస్తుంది. వారికి విలువ ఇస్తుంది. ఇది మనకు తెలియకుండానే మనలో ఎప్పటి నుంచో వస్తున్న ఆ సంప్రదాయం అలా బయటకు వచ్చేస్తుంది. గాజులు ధరించడం వలన స్త్రీలకు ఎన్నోప్రయోజనాలున్నాయి. గాజుల నుంచి వచ్చే శబ్దం ఆ మహిళలో సానుకూల శక్తులు ప్రవహించేలా చేస్తుంది. సమస్యల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని తగ్గించి మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తాయి. చేతులకు రకరకాలైన రంగుల్లో గాజులు వేయడం వలన దిష్టి తగలకుండా ఉంటుంది.
ఇక గాజులు ధరించిన మహిళల నడవడిక కూడా మారుతుంది. గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో ఆ గాజులు ధరించిన మహిళ కూడా అంతే సున్నితంగా ఉంటుంది. నుదుటిన సింధూర తిలకం, చేతినిండా గాజులు ధరించిన మహిళను చూడగానే సాక్షాత్తు ఆ శ్రీమహాలక్ష్మి వచ్చినట్టుగా భావిస్తాం. అందంతో పాటు స్త్రీ సౌభాగ్యం అంతా గాజుల్లోనే దాగుంటుంది. అందుకే చేతినిండా తప్పనిసరిగా మట్టిగాజులు ధరించాలని పెద్దలు చెబుతుంటారు. మట్టిగాజులను శ్రీమంతం సమయంలో తప్పనిసరిగా మహిళకు తొడుగుతారు. దీనికి కూడా పలు ఆధ్యాత్మిక కారణాలున్నాయి. అయిదవ నెలలో స్త్రీ గర్భం లో వుండే పిండానికి ప్రాణం వస్తుంది. శిశువు ఎంత సున్నితంగా వుంటుందో, తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, గాజుల రూపంలో తెలిజేస్తారట. మోచేతికి, మణికట్టుకు మధ్య ప్రాంతంలో వుండే నాడులు గర్బాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. స్వల్ప ఒత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమయి,గర్బంలోని కండరాలు సరిగా పనిచేసే దానికి దోహదపడతాయి. అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్బంలో వుండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి, శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయి.