గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం మాత్రమే కాదు, ఆమె ఊపిరి తీసుకునే గాలి కూడా శిశువు భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం, గాలి, నీరు, శబ్ద కాలుష్యాలు గర్భంలోని శిశువుపై నేరుగా ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా గర్భధారణ మొదటి మూడు నెలల్లో కాలుష్య ప్రభావం అత్యధికంగా ఉంటుంది. తల్లి శ్వాసలో కలిసే ధూళి, రసాయనాలు, వాయు కలుషిత కణాలు రక్తంలోకి చేరి ప్లాసెంటా ద్వారా శిశువుకు వెళ్ళి రక్తప్రసరణను అడ్డుపెడతాయి. దీనివల్ల శిశువు ఎదుగుదల మందగించడం, తక్కువ బరువు, శారీరక మరియు మానసిక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అలాగే, కాలుష్య ప్రభావం వల్ల ప్రిమేచ్యూరీ డెలివరీ, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా పరిశ్రమలు, రోడ్ల దగ్గర నివసించే మహిళలు, వేగంగా పెరుగుతున్న నగర ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు.
గత పరిశోధనల ప్రకారం, మాస్క్ వాడడం, శుద్ధమైన గాలి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం, వాతావరణం కలుషితం అయినప్పుడు ఎక్కువగా బయటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు. తల్లుల శ్వాసతోనే శిశువు ఆరోగ్యం నిశ్చయంగా ప్రభావితమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు శుద్ధమైన వాతావరణంలో జీవించడం, భద్రత చర్యలు పాటించడం అత్యంత అవసరం.