మారేడుచెట్టు (Bilva Tree) మన ధర్మశాస్త్రాలలో, పురాణాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడింది. లక్ష్మీదేవి తన కుడిచేత్తో సృష్టించిన ఈ చెట్టుకే “శ్రీఫలము” అనే పేరు వచ్చిందని విశ్వాసం. ఎందుకంటే, ఈ చెట్టు పువ్వు పూయకుండానే కాయను కాస్తుంది. ఈ విశేషం ఇతర ఏ చెట్టులోనూ ఉండదు.
మారేడు కాయలోని గుజ్జును తీసి ఎండబెట్టి, అందులో విభూతి వేసి ధరించడం పూర్వకాలంలో సాధారణ ఆచారం. ఆయుర్వేదంలోనూ మారేడు పండ్లు, ఆకులు, వేరు ముఖ్యమైన ఔషధాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మారేడు ఆకులు మూడుగా ఉండడం విశేషం. ఈ మూడు ఆకులు త్రిదళం, త్రినేత్రం, త్రిగుణ స్వరూపానికి ప్రతీకలుగా భావించబడతాయి. అందుకే “ఏక బిల్వం శివార్పణం” అన్న మంత్రం పఠిస్తూ శివునికి మారేడు దళములను అర్పిస్తారు.
పూజలో ఈనెతో కూడిన దళాన్ని మాత్రమే శివలింగంపై ఉంచాలి. అలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఐశ్వర్యం తగ్గినా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా మారేడు దళాలతో శివార్చన చేస్తే ఫలితాలు కలుగుతాయని పెద్దలు నమ్ముతారు. శివుడు ఈ పూజను అంగీకరించినవారికి బాల్యం, యౌవనం, కౌమారమనే మూడు స్థితులను సంపూర్ణంగా అనుభవించమని ఆశీర్వదిస్తాడని విశ్వాసం.
మారేడు దళాలతో పూజ చేయడం వలన జ్ఞానం సిద్ధిస్తుంది. మనిషి త్రిగుణాలకు అతీతుడై తురీయ స్థితిని పొందగలడు. ఇది జ్ఞానావస్థ, మోక్షానికి దారితీసే స్థితి. అలాగే మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేసినవాడు మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే ఫలితం పొందుతాడు.
ఇంట్లో మారేడు చెట్టు ఉంటే దాని క్రింద జపం చేసినా, పూజ చేసినా అపార ఫలితం లభిస్తుంది. యోగ్యుడైన భక్తుడిని ఆ చెట్టు క్రింద కూర్చోపెట్టి భోజనం పెట్టడం కోటి మందిని తృప్తిపరిచినంత ఫలితాన్ని ఇస్తుంది.
శాస్త్రం చెప్పిన మూడవిధి ఆచారాలలో — భస్మధారణ, రుద్రాక్షధారణ, మారేడు దళములతో శివార్చన — తప్పనిసరిగా మనిషి జీవితంలో చేయాలని సనాతన సంప్రదాయం చెబుతోంది. అందుకే మారేడుచెట్టు పవిత్రమైనది, శివస్వరూపమని భావిస్తారు.