సీతమ్మ జాడను తెలుసుకునే ప్రయత్నంలో లంకకు చేరిన హనుమంతుడు జానకీమాతను చూసి ఎంతగానో బాధపడతాడు. చుట్టూ రాక్షసుల మధ్య అమ్మ సీతమ్మ తల్లి నిశ్చేష్టురాలై దీనంగా కూర్చొని ఉండటం చూసి ఆగ్రహంతో ఊగిపోతాడు. అశోకవనంలో చెట్టుకింద కూర్చొని ఉన్నది సీతమ్మ తల్లి అని రూఢీ చేసుకున్న తరువాత హనుమంతుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెడతాడు. అశోకవనం తప్పా లంకలోని పలు భవనాలను నేలమట్టం చేస్తాడు. కనిపించిన రాక్షసులను తుదముట్టిస్తాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడి అస్త్రానికి తలొగ్గి బంధీగా లంకేశ్వరుడి ముందుకు వెళ్లిన హనుమయ్య తోకకు నిప్పు అంటిస్తారు. ఆ నిప్పుతో స్వర్ణ లంక మొత్తం తగలబెట్టేస్తాడు. లంకా దహనం తరువాత హనుమంతుడు సీతమ్మతల్లి వద్దకు రాగా… లంకా దహనం రహస్యాన్ని ఆ తల్లికి వివరిస్తాడు.
లంకమొత్తం కాలి బూడిదైనా… నీ తోక అగ్నిలో ఎందుకు కాలలేదు అని ప్రశ్నిస్తుంది. లంక సువర్ణంతో నిర్మింతమైంది. సువర్ణం అగ్నిలో ఎప్పుడైనా కాలుతుందా అని హనుమంతుడు అంటాడు. అయితే లంక ఎలా కాలిపోయింది అని మరలా ప్రశ్నిస్తుంది. లంకను దహనం చేసిన అగ్ని సాధారణ జ్వాల కాదు. అది పవిత్రమైన దివ్యాగ్ని. జో అపరాధ్ భగత్ కర్‌కరై రామ్ రోష్ పావక్ సో జరై అంటాడు. అంటే భక్తులపై వేసిన అపరాధాలను రాముని క్రోధాగ్ని భస్మం చేస్తుంది. ఆ అగ్నే లంకను కాల్చివేసిందని చెబుతాడు. ఇది శ్రీరామచంద్రుని కోపాగ్ని. ఈ దివ్య క్రోధమే స్వర్ణలంకను భస్మం చేసిందని అంటాడు. అగ్నిదేవుడు స్నేహితుడు, శతృవు అనే తేడా చూపదు కదా… లంకను కాల్చిన అగ్ని నీ తోకను ఎందుకు కాల్చలేకపోయింది, తోక ఎలా రక్షించబడింది అని ప్రశ్నిస్తుంది.
ఈ ప్రశ్నను విన్న హనుమంతుడు జానకీదేవి పాదాలకు నమస్కరించి… అమ్మా అగ్నికి నాశనం చేసే శక్తి మాత్రమే కాదు… రక్షించే శక్తి కూడా ఉంది అని అంటాడు. ఈ మాట చెప్పిన తరువాత జానకీదేవి మదిలో మరో ప్రశ్న ఉదయిస్తుంది. ఎవరికి ఆ రక్షణ శక్తి ఉంటుంది అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్న విన్న హనుమయ్య మరోసారి తల్లి జానకీమాత చరణాలకు నమస్కరించి అమ్మా భగవంతుడు మీకు ఇప్పటికే చెప్పాడని నాకు తెలుసు. తుమ్ పావక్ మహు కరహు నివాస … మీరు అగ్నిలోనే నివసిస్తున్నారు. మీ చుట్టూ జ్వాలలు ఉన్నాయి. మీరు ఉన్న ఈ అగ్నిలోనే నా తోక కూడా ఉంది. మీ దివ్య కృపే నన్ను కాపాడింది. అమ్మా మీరే రక్షకురాలు. మీరే భగవంతుని అనుగ్రహం అని అంటాడు హనుమయ్య. హనుమయ్య చెప్పిన మాటలు విన్న సీతమ్మ తల్లి కరుణతో అజర్ అమర్ గుణ్ నిధి సుత్ హోహో కరహు బహుత్ రఘునాయక్ ఛోహో అని ఆశీర్వదిస్తుంది. అంటే, నీవు ఎప్పటికీ అజరామరుడవు. రఘునాయకుడి కృఫ ఎల్లప్పుడూ నీపై ఉంటుంది అని ఆశీర్వదిస్తుంది జానకీ దేవి. అమ్మ ఆశీర్వాదం తీసుకున్న హనుమంతుడు వాయువేగంతో సముద్రాన్ని దాటి శ్రీరాముడి వద్దకు వచ్చేస్తాడు. ఇదీ లంకా దహనం రహస్యం.