ఇప్పుడు మనం చెప్పుకుంటోంది మనకు తెలిసిన కథే. కానీ, దాని కొనసాగింపు చాలా ఉంది. శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తి సమయంలో అడవిలో ఓ చెట్టుకింద పడుకొని ఉండగా, ఆయన పాదాలను చూసి జింక అనుకొని జర అనే బోయవాడు బాణం వేస్తాడు. ఆ బాణం తగిలిన తరువాత బోయవాడు జర చాలా ఆందోళన చెందుతాడు. తాను బాణం వేసింది స్వయంగా కృష్ణపరమాత్ముడిపైనా అని భోరున విలపిస్తాడు. ఆ తరువాత అర్జునుడు వచ్చి శ్రీకృష్ణుడికి దహనసంస్కారాలు నిర్వహించిగా, అగ్నిలోనుంచి వచ్చిన నీలి రంగు పదార్థాన్ని వేపదుంగలో ఉంచి ద్వారకా వద్ద ఉన్న సముద్రంలో వదిలేస్తాడు. ఇదంతా కృష్ణుడి ఆజ్ఞమేరకు మాత్రమే అర్జునుడు చేస్తాడు.
నీలమేఘశ్యాముడు నీలిమాథవుడిగా మారడం
సముద్రంలో ఎన్నో సంవత్సరాల పాటు ఆ దుంగ ప్రయాణం చేస్తుంది. అయితే, ద్వారకాలో శ్రీకృష్ణుడికి బాణం వేసిన జర అనే బోయవాడు పూరీ ప్రాంతంలో సముద్రతీరం వద్దనున్న అడవిలో అటవిక జాతికి చెందిన విశ్వబసుగా జన్మిస్తాడు. ఈ విశ్వబసు అడవుల్లోనూ, సముద్రంలోనూ వేటాడుతుంటాడు. ఒకరోజు ఈ విశ్వబసుకి సముద్రంలో కొట్టుకొస్తున్న వేపదుంగ ఒకటి కనిపిస్తుంది. నీలిరంగులో ఉన్న ఆ దుంగను విశ్వబసు జాగ్రత్త చేసి నిత్యం పూజిస్తూ ఉంటాడు. ఆ దుంగను నీలమాథవుడు అని నామకరణం చేసి పూజించేవాడు.
పూరీకి నీలమాథవుడు
తరువాత కొంతకాలానికి ఈ నీలిమాథవుడి గురించి ఇంద్రద్యుమ్న మహారాజుకు తెలుస్తుంది. దుంగలో బ్రహ్మపదార్థం ఉందని తెలుసుకున్న ఆ రాజు ఆ దుంగను పూరీకి తీసుకొచ్చి అక్కడే విగ్రహాలను చెక్కించేందుకు ప్రయత్నం చేయడం, ఆ విగ్రహాలు అసంపూర్తిగానే ఉండటం, వాటిలోనే ఆ బ్రహ్మపదార్థాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణభగవానుడు ద్వారక నుంచి పూరీకి వచ్చి స్థిరపడ్డాడు. నేటికీ కూడా పూరీలో శ్రీకృష్ణుడు సజీవంగా ఉన్నాడని పూరీ ప్రజలు నమ్ముతున్నారు.
బ్రహ్మపదార్థం మార్పు
ప్రతి 12 సంవత్సరాలకు ఒకమారు విగ్రహాలను మార్చి కొత్త విగ్రహాలను ఆలయంలో అమరుస్తారు. కొత్త విగ్రహాల అమరిక అత్యంత కట్టుదిట్టంగా జరుగుతుంది. ఆ సమయంలోనే బ్రహ్మపదార్థాన్ని కూడా కొత్త విగ్రహాల్లో నిక్షిప్తం చేస్తారు. ఈ తంతు అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఈ తంతు నిర్వహించే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారిపోతుంది. ఆలయ ప్రధాన అర్చకులు కళ్లకు గంతలు కట్టుకొని చేతికి తొడుగులు వేసుకొని బ్రహ్మపదార్థాన్ని పాతవాటి నుంచి తీసి కొత్తవాటిలో నిక్షిప్తం చేస్తారు. కళ్లకు గంతలు కట్టుకొని ఎలా మారుస్తారనే సందేహం రావొచ్చు. ఇదంతా దైవరహస్యమని అంటారు.