మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈసారి పౌర్ణమి గురువారం రోజున రావడం మరింత విశిష్టతను కలిగిస్తోంది. మార్గశిర మాసం స్వయంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది; అదే సమయంలో గురువారము బృహస్పతిదేవునికి సంబంధించిన శుభదినం. ఈ రెండూ కలిసివచ్చే పౌర్ణమి అత్యంత మంగళకరంగా పండితులు చెప్తున్నారు.
ఈ పర్వదినంలో లక్ష్మీపూజ, శ్రీసూక్త పఠనం, దీపారాధన చేయటం ద్వారా ఐశ్వర్యం, ధనసమృద్ధి కలుగుతుందని విశ్వాసం. అదేవిధంగా ప్రదోషకాలం కూడా ఈ రోజున సమీపంగా వస్తుంది కాబట్టి ఆ సమయంలో శివపూజ అత్యద్భుత ఫలితాలను అందిస్తుంది. శివుడికి అభిషేకం చేయటం, బిల్వపత్రార్పణ చేయటం, మహాన్యాసం చదవటం వలన పాపక్షయము, శాంతి, సౌభాగ్యం ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజు చంద్రుడిని ఆరాధించడం కూడా అత్యంత శ్రేష్ఠం. చంద్రశేఖరుడైన శివుడిని పూజించడం, చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వడం వలన చంద్రదోషాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత, మనోస్థిరత పెరుగుతాయి. కుటుంబంలో శాంతి, సమృద్ధి నెలకొంటాయి.
పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రత్యేకమైన గురువార పౌర్ణమి నాడు లక్ష్మీవార వ్రతం, శివపూజ, చంద్రారాధన చేస్తే సంవత్సరమంతా అష్టలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అన్ని శుభకార్యాలు సులభంగా సిధ్ధిస్తాయి. ఈ రోజు భక్తులు ఉపవాసం, దీపార్చన, ధానధర్మాలు చేస్తే మరింత పుణ్యఫలం లభిస్తుంది.