దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 10 రోజుల్లో 11 రకాలైన అలంకరణలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ 11 రకాలైన అలంకరణల వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ఇవి మనిషిని దుర్గుణాల నుంచి సద్గుణాలవైపు నడిపించడమే. ప్రతి అలంకరణ ఒక శక్తి స్వరూపంగా ఉంటూ మనిషిలో మార్పును తీసుకొచ్చేందుకు సూచికగా ఉంటుంది.
ఇక మహిషాసురుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు. అతనిలో అజ్ఞానం, అహంకారం, కామం, క్రోధం, లోభం, మధ మాత్సర్యాలు వంటి అరిషడ్వర్గాలను ఇముడ్చుకున్నవాడు. ఇలాంటి వాడిని సంహరించడానికి ఒక్కరూపం, ఒక్క అలంకరణ సరిపోదు. అందుకే అమ్మవారు 11 రూపాలు ధరించి చెడును అణిచివేసింది. ప్రతి అలంకరణ మనలోని ఒక దుర్గుణాన్ని తొలగించే దైవశక్తికి ప్రతీక. మహాకాళి రూపం మనలోని భయాన్ని, అజ్ఞానాన్ని తొలగిస్తే, మహాలక్ష్మీ రూపం ఏదైనా పని జరగడానికి అవసరమైన సంపదను, ఇబ్బందులను తొలగించుకోవడం అవసరమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. సరస్వతి రూపం జ్ఞానాన్ని కలిగిస్తే, రాజరాజేశ్వరి రూపం సౌందర్యాన్ని, శక్తిని అనుగ్రహిస్తుంది.
10 రోజులపాటు 11 అలంకరణలు చేయడం వెనుక రహస్యం ఏమిటంటే – ప్రతి రోజు ఒక గుణాన్ని జయించి, భక్తుడు ఆధ్యాత్మికంగా ఎదగడం. చివరి రోజైన విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనం ఇచ్చి, భక్తుని లోపలి చెడును పూర్తిగా నాశనం చేస్తారు. అంటే ఈ 11 రూపాలు భక్తుని జీవితయాత్రలో ఆధ్యాత్మిక మెట్లుగా నిలుస్తాయి.
భక్తులు ప్రతి రోజూ అమ్మవారిని తగిన పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలతో ఆరాధిస్తే, ఆయా అలంకరణల శక్తిని అనుభవిస్తారు. ఈ పూజల వలన మనసు శాంతిస్తుంది, చెడు గుణాలు తగ్గుతాయి, ధైర్యం, ధర్మం, విజయం లభిస్తాయి.
అందువల్ల దుర్గాదేవి 11 అలంకరణలు మనిషి ఆత్మ శుద్ధికి, విజ్ఞాన వికాసానికి, ధర్మ స్థాపనకు సూచికలు. ఇవి కేవలం ఆచారాలు కాక, జీవితాన్ని విజయపథంలో నడిపే ఆధ్యాత్మిక రహస్యాలే. మనిషి ఈ 11 రూపాలను ఎరుకలో ఉంచుకొని స్పుహతో ప్రవర్తితే తప్పకుండా మనిషి మంచి మార్గంలో పయనిస్తాడని, మనిషికి తిరుగు ఉండదని, చెడు అతని దరిచేరదని అంటారు.