శ్రీహరి అవతారాల్లో రాముడిది ఏడో అవతారం కాగా, శ్రీకృష్ణుడిది ఎనిమిదో అవతారం. రాముడు త్రేతాయుగంలో ధర్మసంస్థాపన గావించగా…కృష్ణుడు ద్వాపరయుగంలో ఆయుధం పట్టకుండా ధర్మాన్ని ముందుకు నడిపించాడు. ఇద్దరి అవతారాలకు మూలం ఒక్కటే. కానీ, ఇద్దరూ కలిసినట్టుగా ఎక్కడా లేదు. ఏ పురాణాల్లోనూ చెప్పబడలేదు. ఇలా ఇద్దరూ కలిశారు అని చెప్పారు అంటే అది కేవలం కల్పితమే. కానీ, వారి అవతార మాయలు, లీలలు వర్ణించడం చాలా కష్టం. ఏ అవతారంలో మాట ఇచ్చినా దానిని నిలబెట్టుకునేందుకు ధర్మప్రభువులు ప్రయత్నిస్తారు. త్రేతాయుగంలో ఇచ్చిన హామీని ద్వాపర యుగంలో నిలబెట్టుకున్నాడు దేవదేవుడు. దానికి కృతజ్ఞతగా నిర్మించిన ఆలయమే శ్రీ అలఘు మల్లారి కృష్ణస్వామి ఆలయం. ఇక్కడ శ్రీరామ, శ్రీకృష్ణ మందిరాలు ఒకోచోట ఉండటం విశేషం. ఒకే గర్భాలయంలో శ్రీరామ శ్రీకృష్ణ విగ్రహాలు ఉండటంతో ఆలయంలో ఇరువురికి విడివిడిగా ధ్వజస్తంభాలు, బలిపీఠాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమంటే గరుత్మంతుని విగ్రహం. ఈ విగ్రహం కంటి నుంచి కన్నీరు బొట్లు బొట్లుగా కారుతుంది. ఇది నేటికీ మన కంటికి కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలియాలంటే పురాణకాలానికి వెళ్లాల్సిందే.
ఈ ఆలయంలోని గరుత్మంతుని విగ్రహం నుంచి కన్నీరు కారడానికి వాయుపుత్రుడే కారణమని అంటారు. అంతేకాదు, ఈ ఆలయంలో మరో విశేషమేమంటే ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతి దేవితో కలిసి ఉంటాడు. జాంబవతీదేవితో కలిసి ఉన్న ఏకైక దేవాలయం ఇదొక్కటే. ఈ ఆలయాన్ని స్వయంగా జాంబవంతుడే నిర్మించారని అంటారు. శమంతకమణి వివాదం తరువాత జాంబవతిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకుంటాడు. దీనికి సంబంధించిన కథ మనకు వినాయక చవితి కథలో వస్తుంది. ఈ కథలో శమంతకమణి కోసం జాంబవంతుడితో శ్రీకృష్ణుడు మల్లయుద్ధం చేసింది మన్నారు పోలూరులోనే అని అంటారు. శ్రీకృష్ణుడు మల్లయుద్ధం చేసిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని అలఘు మల్లహరి పోరు ఊరు అని పూర్వం పిలిచేవారు. ఇ
దే కాల క్రమంలో మన్నారు పోలూరుగా మారింది. మన్నారు పోలూరులోని అలఘు మల్లహరి పోరు ఊరులోని క్షేత్రానికే నీలాప నిందా పరిహార క్షేత్రంగా పిలుస్తారు. ఇక గరుత్మంతుని విషయానికి వస్తే శ్రీహరికి వాహనంగా ఉన్న గరుడికి తన కన్నా బలవంతుడు లేడనే గర్వం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన శ్రీహరి తన వివాహానికి హనుమంతుడిని తోడ్కొని రావాలని, కదలీ వనంలో తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలియజేయాలని శ్రీహరి చెబుతాడు. మహావిష్ణువు ఆదేశాల మేరకు వైనతేయుడు ఆగమేఘాలమీద కదలీవనంలోకి వెళ్తాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడిని పలుమార్లు పిలిచినా పలక్కపోవడంతో ఆగ్రహంతో తన రెక్కలతో హనుమయ్యను కదిపేందుకు ప్రయత్నించాడు. కళ్లు తెరిచిన హనుమయ్య గరుత్మంతుని దవడపై ఒక్కదెబ్బ వేస్తాడు. ఆ దెబ్బతో ఎగిరొచ్చి అలఘు మల్లహరి పోరు ఊరిలో పడతాడు. ఈ ఆలయంలోని గరుత్మంతుడి ఎడమ వైపున్న దవడ వాచిపోయి ఉంటుంది. దవడ నుంచి కన్నీరు కారుతుంది. ఈ విగ్రహాన్ని మన్నారు పోలూరులోని ఆలయంలో చూడొచ్చు. అంతేకాదు, ఈ ఆలయం వద్దే శ్రీకృష్ణుడి అనుమతితో రుక్మిణీదేవి సీతామాతగా దర్శనం ఇచ్చిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. జాంబవంతుడే స్వయంగా నిర్మించిన ఈ ఆలయానికి ఆయనే క్షేత్రపాలకుడిగా ఉండి రక్షిస్తున్నాడని భక్తుల నమ్మకం.