మౌనంగా ఉండేందుకు చాలా మంది ఇష్టపడరు. పక్కన ఎవరుంటే వారితో మాట్లాడటానికి ఇష్టపడుతుంటారు. ఈ భౌతిక ప్రపంచంలో కమ్యునికేషన్‌కు విలువ ఎక్కువని, కమ్యునికేషన్ లేకుంటే జీవనం సాగించడం కష్టమని అంటుంటారు. కానీ, మౌనం వలన ఉపయోగాలు, ఆధ్యాత్మికపరంగా ఉండే ప్రయోజనాలు తెలిస్తే మౌనం వహించేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. మౌనంగా ఉండటం అంటే మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. మనసు, ఆలోచనలు, స్పందనలు అన్నింటినీ నియంత్రించడాన్నే మౌనం అంటాం. ఉపనిషత్తులు, యోగశాస్త్రాలు, భగవద్గీత వంటి గ్రంథాలు మౌనాన్ని అత్మజ్ఞానానికి మార్గంగా పేర్కొంటారు. మాటల శబ్దం బయటి ప్రపంచానికి సంబంధించింది. మాటలను నియంత్రించి మౌనంగా ఉండటం ప్రారంభిస్తే… ఆ మౌనం మన లోపలికి వెళ్లి ఆంతరంగాన్ని తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మౌనంగా ఉంటడం అలవాటు చేసుకుంటే క్రమంగా ధ్యానం వైపుకు మనసు మరలుతుంది. మాటలు మాట్లాడుతూ ఉంటే మన జీవశక్తి దుర్వినియోగం అవుతుంది. కానీ, మౌనంగా ఉండటం వలన కోల్పోయిన జీవశక్తిని తిరిగి తెచ్చుకోవచ్చు. మాటలు మన ఆలోచనలను అడ్డుపడేలా చేస్తుంది. కానీ, మౌనం మనస్సును స్థిరపడేలా చేస్తుంది. భావోద్వేగాలు తగ్గుముఖం పడతాయి. మౌనంలో పరమతత్వాన్ని అనుభవించవచ్చు. మౌనంగా ఉండటం వలన వాగ్దోషాలు తగ్గిపోతాయి. మన వాక్కు సత్యంగా మారుతుంది.
ఉపనిషత్తులు యతో వాచో నివర్తంతే అని చెబుతున్నది. మౌనం ఉన్న చోట మాటలు దారి మళ్లుతాయి. అక్కడే బ్రహ్మము తారసపడుతుంది. మౌనమ్ అశ్మి గుహ్యానాం అని భగవద్గీత చెబుతున్నది. రహస్యాలలో నేను మౌనం అని అర్ధం. మౌనం అన్నది ఆధ్యాత్మికపరంగానే కాదు జీవన విధానంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతాం. మాట్లాడిన మాటలు సత్యాలుగా ఉంటాయి. పరిశీలనతో స్పష్టంగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంద. మౌనంగా ఉండటం వలన మెదడు విశ్రాంతిని పొందుతుంది. గుండె కొట్టుకునే విధానం క్రమబద్ధీకరణతో ఉంటుంది. ఆత్మస్థైర్యం, ప్రశాంతత, ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞానం, శాంతితో పాటు భగవంతుడిని దర్శించినంత అనుభూతి కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో మౌనం అత్యంత శక్తివంతమైన సాధన ప్రక్రియ. లంకణం పరమౌషధం అన్నట్టుగానే మౌనం కూడా పరమౌషధమే.