దీపం అంటే వెలుగును ఇచ్చే సాధనం మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, మనకు మార్గాన్ని చూపించే పవిత్రమైన చిహ్నం కూడా. దీపం జ్ఞానానికి, పవిత్రతతకు, శాంతికి, దివ్యత్వానికి ప్రతిరూపం. ఈ దీపం వెనుక ఎన్నో ఆలోచనలు, కథలు, ఆచారాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపం – జ్ఞానం, అజ్ఞాన నిర్మూలన చిహ్నం
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం. ఉపనిషత్తుల్లో దీపం గురించి పలు విషయాలు చెప్పబడ్డాయి. తమసో మా జ్యోతిర్గమయ అని ఉపనిషత్తు చెబుతున్నది. అంటే చీకటి అనే అంథకారం నుంచి వెలుగువైపు నడిపించడం అని అర్ధం. దీపం మన ఆత్మలోని జ్ఞానజ్యోతిని మేల్కొలుపుతుంది. మనసును దివ్యమైన జ్ఞానం వైపుకు నడిపిస్తుంది. దీనికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఒకసారి ఓ గురువు తన శిష్యుడిని చీకటిగా ఉన్న గుహలోకి తీసుకెళ్లి, ఈ చీకటిని తొలగించడానికి ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు. గురువు అడిగిన ప్రశ్నను విన్న శిష్యడు… చీకటిని తీసివేయడం కష్టం గురుదేవా అని చెబుతాడు. వెంటనే గురువు ఓ చిన్నదీపాన్ని వెలిగించి ఈ దీపం సహాయంతో చీకటిని తొలగించమని చెబుతాడు. వెలుగుతున్న దీపాన్ని తీసుకొని శిష్యుడు గుహమొత్తం తిరుగుతాడు. చీకటిని తొలగించడానికి వెలుగు తప్ప వేరే మార్గం లేదని అలాగే అజ్ఞానాన్ని తొలగించడానికి జ్ఞానం అనే దీపం వెలిగించాని చెబుతాడు గురువు. ఇది చిన్నకథే. అయినప్పటికీ ఆధ్యాత్మికంగా మంచి సందేశాన్ని ఇస్తుంది.
దీపం – దైవిక శక్తి యొక్క చిహ్నం
సనాతన ధర్మంలో దీపం దైవిక శక్తికి ప్రతీక. దీపారాధన, హారతి, దీపం వెలిగించడం వంటి ఆచారాలతో దేవతలను ఆరాధించడం ఒక సాధారణ ఆచారంగా మారింది. ప్రతిరోజూ దీపాన్ని ఇంట్లో వెలిగించడం వలన సానుకూల శక్తిని నింపుతుందని అంటారు. కార్తీకమాసంలోనూ, దీపావళి, పండుగ సమయంలో దీపాలు వెలిగించడం ఓ ఆచారంగా మారింది. దీపావళి పండుగ వెనుక ఉన్న కథలో శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చినపుడు అయోధ్యవాసులు ఆనందంతో ఇళ్లను దీపాలతో అలంకరించారు. రాముడి ఆగమనాన్ని స్వాగతించడమే కాకుండా అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా దీపాలను వెలిగించారు. అధర్మంపై విజయానికి గుర్తుగా వెలిగించిన ఆ దీపాలు దీపావళి నేటికి వారసత్వంగా కొనసాగుతోంది.
దీపం – శాంతి, సంప్రదాయం
ఇంట్లో దీపం వెలిగించడం వలన శాంతి కలుగుతుంది. సంపద సంమృద్ధిగా లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు. ఇలా కార్తీక మాసంలో రోజూ దీపాలను వెలిగించడం వలన కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో దీపారాధన చేయడం వలన ఇంట్లోకి దుష్టశక్తుల ప్రవేశం రాకుండా అడ్డుకుంటుంది. కార్తీకమాసంలో తులసిమొక్క వద్ద దీపం వెలిగించడం వలన కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది. ఇక తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. తులసి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అటువంటి తులసిమొక్క వద్ద దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి సాన్నిధ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవితో పాటు ఐశ్వర్యం, శాంతిని కూడా నింపుతుందని నమ్ముతారు.
దీపం యొక్క ఆచారాలు, వైవిధ్యం
సనాతన హైందవ ధర్మంలో దీపం వెలిగించే విధానం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దీపం ఎలా వెలిగించాలి అన్నది కూడా అత్యంత ముఖ్యమైనదే. దీపంలో వత్తుల సంఖ్యపైనే అందరికీ పలు సందేహాలుంటాయి. ఒక్క వత్తితో దీపం వెలిగించలా లేక రెండు వత్తులతో దీపం వెలిగించాలా మూడు వత్తులు వేయాలా అన్నది తెలుసుకోవాలి. ఒకవత్తితో దీపం వెలిగిస్తే జ్ఞానాన్ని రెండు వత్తులతో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య ఐక్యతను సూచిస్తుంది. అదేవిధంగా దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ రెండు దిశల్లో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇకపోతే, దీపంలో ఉపయోగించే నూనె కూడా అత్యంత ముఖ్యమైనదే. దీపంలో సాధారణంగా నెయ్యివేసి వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం త్వరగా ఫలితాలను ఇస్తుంది. అందులోనూ ఆవునెయ్యితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోమయం అనే శ్లోకాన్ని పఠిస్తారు. ఇలా దీపాన్ని వెలిగిస్తూ శ్లోకం పఠించడం వలన దైవికమైన శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
దీపం – సామాజిక ఐక్యత
దీపావళిని దీపాల పండుగ అని పిలుస్తారు. దీపాలను ఇంట్లో వరసగా వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించడం ద్వారా సమాజంలో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయి. కార్తీకమాసంలో ఆలయాల్లో సామూహికంగా పెద్ద ఎత్తున దీపాలు వెలిగిస్తారు. సమాజంలోని భక్తిని, సామాజిక సామరస్యాన్ని తెలియజేస్తుంది. ఈ సామరస్యం గురించి ఓ చిన్నికథ రూపంలో తెలుసుకుందాం. అనగనగా ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ సంవత్సరం దీపావళి సమయంలో సామూహికంగా వెలిగించిన దీపాలు ఆరిపోతాయి. అయినప్పటికీ గ్రామస్తులందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ సహకరించుకుంటూ ఒక్కొక్కటిగా దీపాలను వెలిగిస్తారు. గ్రామస్తుల సహాయం, సహకారాన్ని చూసిన వరుణదేవుడు వర్షం కురిపించడం ఆపేస్తాడు. గ్రామంలోని ప్రజల ఐక్యతను, దీపం పవిత్రతను ఈ నొక్కి చెబుతుంది.
సనాతన ధర్మంలో దీపం కేవలం వెలుగును ఇచ్చే సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞానం, శాంతి, దైవిక సాన్నిధ్యం, సామాజిక ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా మన మనసులోని చీకటిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతుండటం విశేషం. అనాదికాలంగా దీపాలను వెలిగిస్తున్నారు. భవిష్యత్తులో కూడా దీపాలను వెలిగిద్దాం. సనాతన ధర్మాన్ని మరో వెయ్యేళ్లు జీవించేలా చేద్దాం.