తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తిరుమల దర్శనం అంటే ఒకటి ఖర్చుతో కూడుకున్నది. రెండోది సమయంతో కూడుకున్నది. ఖర్చు చేయలేనపుడు సమయాన్ని వెచ్చించాలి. గంటల తరబడి క్యూలైన్లో ఉండి గోవిందా అంటూ ఆయన్ను దర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే తన కోసం నిరీక్షించే భక్తులంటేనే స్వామివారికి అత్యంత ప్రీతి. కష్టాల సాగరాన్ని ఈదుకుంటూ, సమస్యల సుడిగుండాలను దాటుకుంటూ తన వద్దకు వచ్చినవారిని కాచి రక్షిస్తాడు. అందుకే ఆయన్ను కలియుగదైవంగా మనం పూజిస్తాం.
ఇక వయసు పైబడినవారు తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడం సాధ్యమౌతుందా అంటే ఒకప్పుడు కష్టమే. కానీ, ఇప్పుడు సులభమని అంటున్నారు. వయసు పైబడినవారు అంటే 65 ఏళ్లు నిండిన వారు సాధారణ క్యూలైన్లో కాకుండా వారు తమ వయసుకు సంబంధించిన ఐడెంటిటీ కార్డును చూపించి ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. రెండు సమయాల్లో వీరికోసం దర్శనాలను కేటాయించారు. ఒకటి ఉదయం 10 గంటలకు, రెండోది మధ్యాహ్నం 3 గంటలకు.
క్యూలైన్‌కు సంబంధించి ఎస్ 1 కౌంటర్ వద్ద ఫొటో ఐడీ, వయసుకు సంబంధించిన ప్రూఫ్‌ను చూపించాలి. అనంతరం, స్వామివారి ఆలయం పక్కనే ఉన్న వంతెన కింద ఉన్న గ్యాలెరీ ద్వారా ఆలయం కుడివైపుకు వెళ్లాలి. అక్కడి నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. కేవలం 30 నిమిషాల్లోనే వీరు దర్శనం చేసుకొని బటయకు రావొచ్చు. వీరికి దర్శనం పూర్తయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలను అందిస్తుంది. ఒకవేళ మీరు నడలేని పక్షంలో వీరికోసం కార్ పార్కింగ్ నుంచి కౌంటర్ గేటు వరకు బ్యాటరీ కార్ల సహాయంతో తీసుకెళ్తారు. స్వామివారిని దర్శించుకోవాలనే బలమైన నమ్మకం, సంకల్పం ఉంటే ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత ఆయన్ను దర్శించుకునేంత వరకు మన శరీరం, కాళ్లు మనకు సహకరిస్తాయి. ఇది ఆ శ్రీవేంకటేశ్వరునిపై ఉన్న అచంచలమైన నమ్మకం. దర్శనానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా టీటీడీ హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్ 8772277777 ను సంప్రదించవచ్చు.