మధురై–రామేశ్వరం మార్గంలో ఉన్న ఉత్తర కోసమాంగై మహాశివాలయం దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం బ్రహ్మ–విష్ణువుల మధ్య ఎవరు శ్రేష్ఠులు అనే వివాదం సమయంలో పరమశివుడు మొగలిపువ్వును పూజలో వినియోగించరాదని నిషేదించాడు. ఈ నిషేధం దేశంలోని అనేక ఆలయాల్లో పాటిస్తారు. అయితే ప్రత్యేకత ఏమిటంటే—ఈ ఉత్కృష్టమైన శివక్షేత్రంలో మాత్రం మొగలిపువ్వుతోనే శివారాధన జరుగుతుంది. ఇది ఈ ఆలయానికి ఉన్న శాస్త్రోక్త, తాంత్రిక, ఆగమిక సంప్రదాయాల వలన ఏర్పడిన ప్రత్యేకతగా భావిస్తారు.
ఈ ఆలయం భూమిపై మొదటగా వెలసిన శివాలయాల్లో ఒకటిగా పురాణాలు చెప్పగా, శివుడి స్వస్థానంగా కూడా పలువురు ఆచార్యులు పేర్కొంటారు. ఇక్కడ స్వామివారు మూడు దివ్యరూపాల్లో దర్శనం ఇస్తారు—శివలింగం, మరకత నటరాజ రూపం, స్పటికలింగం. మూడు రూపాల దర్శనం ఒకే క్షేత్రంలో లభించడం అత్యంత అరుదైన దైవ లీలగా భావిస్తారు.
అద్భుతమైన ద్రావిడ శిల్పకళ, మూడు వేల సంవత్సరాల ప్రాచీన నిర్మాణ శైలి, ఆలయం నిండా పరిభ్రమించే పవిత్ర శైవ తత్త్వం— ఇవన్నీ కలిపి ఆలయ ఆధ్యాత్మిక శక్తిని ఇనుమటింపజేస్తున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే స్పటికలింగాభిషేకం అత్యంత పవిత్రమైన దర్శనంగా భావించబడుతుంది.
ఇహలోకంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి ప్రసాదించడమే కాక, పరలోకంలో మోక్షప్రాప్తి కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే రామేశ్వరం యాత్రకు వెళ్తున్న ప్రతి యాత్రికుడు తప్పకుండా ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తాడు.