దసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు మహా దుర్గాష్టమి కావడంతో అమ్మవారిని శోభాయమానమైన రత్నాలంకారాలతో అలంకరిస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఈ రోజున సింహవాహనంపై దర్శనమిస్తూ భక్తులకు శౌర్యం, విజయాన్ని ప్రసాదిస్తారని నమ్మకం.
ఇక దుర్గాష్టమి రోజున అమ్మవారికి ప్రత్యేకించి చండీహోమం, కుమారికా పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాలలను దుర్గాస్వరూపిణిలుగా భావించి వారికి ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. పిల్లలను దుర్గాదేవిగా ఆరాధించడం వలన కష్టాలు తొలగిపోతాయని, శతృబాధలు నశిస్తాయని, ధైర్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణవచనం. అందుకే దుర్గాష్టమి రోజున చిన్నారులకు ప్రతిఇంట ప్రత్యేక పూజలు చేస్తారు.
దుర్గాష్టమి రోజున అమ్మవారికి చలివిండి, పులిహోర, దద్ద్యోజనం, జిలేబి, వడలు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ నైవేద్యాలను సమర్పించడం వలన ఇంట్లో శాంతి, సంపద స్థిరపడతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారిని ఆరాధించడం వలన జీవితంలో వచ్చే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి. విద్య, వృత్తి, వ్యాపార రంగాల్లో విజయం సాధించేందుకు అవకాశం లభిస్తుంది. కష్టసమయంలో అమ్మవారి అనుగ్రహంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని శుభకరమైన ఫలితాలు పొందుతారని భక్తుల నమ్మకం.