సప్తపది అంటే అర్ధం ఏంటి?
వివాహం జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకోవడం సహజం. వివాహం కోసం లక్షలు ఖర్చుపెడతారు. అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకుంటారు. అయితే, వివాహం ఎలా జరిగింది అని కాకుండా ఋగ్వేదంలో ఎలా చెప్పబడిందో ఆవిధంగా జరిగిందా లేదా అన్నది చూడాలి. వివాహ మహోత్సవంలో నిర్వహించవలసిన ఘట్టాలన్నీ తప్పకుండా నిర్వహించాలి. జీలకర్ర బెల్లానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో…మూడు ముళ్ల బంధం తరువాత సప్తపదికి కూడా అంతే అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సప్తపదిని నిర్వహించకుండా వివాహాన్ని ముగించకూడదు అని వేదశాస్త్రం చెబుతున్నది. ఇక్కడ సప్తపది అంటే ఏడు అడుగులు అని అర్ధం. భార్య భర్తలు కలిసి అగ్ని సాక్షిగా అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేస్తారు. ఈ ఏడు అడుగుల ద్వారా జీవితాంతం ఒకరినొకరు ధర్మబద్ధంగా నియమాలు పాటిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తామని చేసుకునే శపథాలే ఈ సప్తపది.
వివాహంలో సప్తపదికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?
వివాహంలో సప్తపదికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఏడు అడుగుల్లో ఒక్కో అడుగుకు ఒక్కో విధమైన అర్ధం ఉంటుంది. ఇందులో మొదటి అడుగు అంటే అగ్నిచుట్టూ మొదటిసారి తిరిగే సమయంలో అన్నాద భవే సఖే అని చదువుతూ తిరుగుతారు. కుటుంబ జీవనంలో ఆహారం సమృద్ధిగా లభించాలని కోరుకుంటూ వేసేది మొదటి అడుగు. ఇక రెండో అడుగు శక్తి, ఆరోగ్యం కోసం, మూడో అడుగు సంపద, ఐశ్వర్యం కోసం, నాలుగో అడుగు సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం వేస్తారు. ఐదవ అడుగు సంతానం, జ్ఞానం కోసం వేస్తారు. ఆరో అడుగు ఆరోగ్యకరమైన వృత్తి జీవితం కోసం వేస్తారు. ఏడవ అడుగు స్నేహం, నిత్య బంధానికి సంబంధించి వేస్తారు. ఏడు అడుగులు వేసిన తరువాత భర్త తన భార్యతో సప్తపదీభవ సఖా సప్తపదం ప్రపద్యే అని పలుకుతాడు. దీని అర్ధం ఏమంటే ఈ ఏడు అడుగుల నడక తరువాత నీవు నా జీవత సహధర్మచారురాలివి అని. ధర్మబద్ధమైన వైవాహిక జీవితానికి మూలం ఈ సప్తపది. వివాహం శాస్త్రబద్ధంగా పూర్తి అయిందని చెప్పడానికి కూడా సప్తపది మూలం. సప్తపది లేకుండా వివాహం జరిపితే… వేదశాస్త్రం పరంగా ఆ వివాహం అసంపూర్ణంగా పూర్తయినట్టుగా చెబుతారు. దైవానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే సప్తపది ముఖ్యం.
సప్తపదిని నిర్వహించకుంటే జరిగే అనర్ధాలేంటి?
సప్తపదని నిర్వహించకుండా వివాహాన్ని పూర్తిచేస్తే ఆ వివాహ బంధం శాస్త్రబద్ధంగా ఆమోదం పొందదు. వేదశాస్త్రాలు సప్తపదిని వివాహానికి అంతిమ ప్రమాణంగా పేర్కొన్నాయి. సప్తపది నిర్వహించకుంటే గృహస్తాశ్రమంలో అస్థిరత కలుగుతుంది. భార్యభర్తల మధ్య అపార్థాలు, అసహనాలు ఎక్కువ కావొచ్చు. సంతాన సంబంధమైన ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. పురాణాల ప్రకారం అగ్ని సాక్షిగా వ్రతాలు లేకుండా కలయిక వల్ల పుత్రప్రాప్తి ఆలస్యం అవతుందని, దైవానుగ్రహం కలగదని, సప్తపది లేకుండా వివాహం జరుపుకోవడం వలన వివాదాలు చోటు చేసుకుంటాయని, పితృదోష ప్రభావాలకు గురికావలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వేద మంత్రాల మధ్య తప్పకుండా సప్తపదిని నిర్వహించాలి. అగ్నిసాక్షిగా జరిగే తంతు వైవాహిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. జ్యోతిష్యుల మార్గదర్శకంతోనే వివాహ ముహూర్తం, కర్మలు చేపట్టాలి. చివరిగా చెప్పాలంటే సప్తపది లేకుండా జరిగే వివాహం కేవలం శరీరానికి సంబంధించిన కలయిక మాత్రమే అవుతుంది. ఆత్మల కలయిక కాదు. ఆత్మల కలయిక లేకుండా జరిగే తంతు ఎక్కువకాలం నిలవదు. బహుశా ఈరోజుల్లో వివాహం జరిగిన కొన్నాళ్లకు విడిపోవడానికి ఇదికూడా ఒక కారణం కావొచ్చు.