బదరీనాథ్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. పురాణాల ప్రకారం బదరీనాథ్ చరిత్ర అంటే కొండవీటి చాంతాడు అని చెబుతారు. బదరీనాథ్‌లో శ్రీమహావిష్ణువు నరనారాయణుల రూపంలో కొలువై ఉంటాడు అని చెబుతారు కదా. నారాయణుడు అంటే మహావిష్ణువు. మరి నరుడు ఎవరు అన్నది ఇక్కడ ప్రశ్న. బదరీ క్షేత్రానికి సమీపంలో లీలాదుంగి అనే ప్రదేశం ఉంది. బదరీనాథుడిని దర్శించుకున్న తరువాత తప్పనిసరిగా ఈ లీలాదుంగిని కూడా దర్శించుకోవాలి. దీకికి పలు కారణాలున్నాయి.
శివపురాణం ప్రకారం ఈ లీలాదుంగి ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు సేదతీరుతుండేవారు. ఓ సమయంలో లీలాదుంగి నుంచి పార్వతీదేవి కొంతదూరం వెళ్లిరాగా అక్కడ ఓ శిల మాట్లాడటం మొదలుపెట్టింది. అనంతరం ఆ శిల బాలుడిగా మారడంతో… బాలుడిని చూసి పార్వతీదేవి మంత్రముగ్దురాలైంది. వెంటనే ఆ బాలుడికి స్తన్యమిచ్చి తన బిడ్డగా చేసుకుంది. అయితే, మహాశివుడు వచ్చింది మామూలు బాలుడు కాదని హెచ్చరించినా పార్వతీదేవి వినిపించుకోలేదని, పుత్రవాత్సల్యంతో బాలుడిని తన ఇంట్లోనే ఉంచుకుందని అంటారు. పార్వతీదేవి తిరిగి ఇంటికి రాగా తలుపులు మూసేసి ఉంటాయి. ఎంత పిలిచినా తలుపులు తెరుచుకోలేదట. కొంత సమయం తరువాత బాలుడు తలుపులు తెరిచి బదరీనాథ్‌లో ఇకనుంచి తాను ఉంటానని, పార్వతీపరమేశ్వరులు బదరీనాథ్‌కు పైఎత్తున ఉన్న కేదార్‌నాథ్‌లో ఉండాలని కోరాడట.
నరుడి రూపంలో ఉన్న నారాయణుడి మాటను గౌరవించి బదరీని నారాయణుడికి దానంగా ఇచ్చి పార్వతీపరమేశ్వరులు కేదార్‌నాథ్‌కు వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఈ లీలాదుంగి ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు, నరనారాయణుడు కలుసుకుంటారని పండితులు చెబుతున్నారు. పరమపవిత్రమైన ఈ లీలాదుంగిని చార్‌ధామ్ యాత్ర చేసేవారు తప్పకుండా దర్శించాలని అంటారు.