కంచి వెళ్లినవారు తప్పకుండా దర్శించుకోవలసిన వాటిల్లో ఒకటి శివకంచి. అత్యంత పురాతనమైన ఈ శివకంచిలో మహాశివుడిని ఏకాంబరేశ్వరుడిగా చెబుతారు. ఇక్కడ సైకతలింగాన్ని పూజిస్తారు. సాధారణంగా శివుడిని అభిషేకప్రియుడు అని పిలుస్తారు. కానీ, కంచిలోని స్వామికి అభిషేకం చేయరు. ఇక్కడ స్వామిని అమ్మవారు స్వయంగా తయారు చేసి పూజించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శివపురాణం ప్రకారం, అమ్మవారు సైకత లింగాన్ని తయారు చేసి ఇక్కడే తపస్సు చేశారని, ఆ విధంగా కంచిలో స్వామి ఏకాంబరేశ్వరుడిగా దర్శనం ఇస్తున్నాడని అంటారు. ఏకాంబరేశ్వరుడు అంటే భూమితత్వం కలిగిన స్వామి అని అర్ధం.
అమ్మ కొలిచిన చోటు కావడంతో ఇక్కడ స్వామి చాలా ప్రశాంతంగా ప్రసన్నవదనంతో దర్శనం ఇస్తారు. శివలింగాన్ని చూడగానే మనసు కుదుటపడుతుంది. భౌతిక సంబంధాల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని మనసు చెబుతుంది. ఆ సమయంలో కళ్ళు సంతోషంతో నిండిపోతాయి. ఏకాంబరేశ్వరుడిని దర్శించుకున్నవారి జన్మ పునీతమౌతుందని, ఈతి బాధలు తొలగిపోతాయని నమ్మకం. అమ్మవారు స్వయంగా తయారు చేసి పూజించిన విధానాన్ని మనసులో ఉంచుకొని దర్శించుకుంటే చాలని పండితులు చెబుతున్నారు.