నటుడు డాలీ ధనుంజయ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక గిఫ్ట్ అందించారు. ఆయన డాలీ పిక్చర్స్, త్రిశూల్ విజనరీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న జింగో సినిమా నుంచి సెకండ్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతేడాది విడుదలైన జింగో సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. డాలీ ధనుంజయ చెప్పిన జింగో డైలాగ్, దానికి జతగా వచ్చిన నర నర జింగో అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటకు, డైలాగ్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనతో చిత్ర బృందం ఎంతో సంతోషించింది. ఈ ప్రోత్సాహంతో సినిమా కథను, దాని పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఒక చిన్న పట్టణం నేపథ్యంలో మొదలైన కథను ఇప్పుడు పెద్ద స్క్రీన్‌కు సరిపోయే విధంగా, గ్రాండ్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
చిత్ర బృందం మాట్లాడుతూ, “మా సినిమాకు వచ్చిన స్పందన మమ్మల్ని మరింత పెద్దగా ఆలోచించేలా చేసింది. ఇది ప్రేక్షకులకు 2026లో ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. రాజకీయ వ్యంగ్యం, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్… ఇలా అన్ని అంశాలను కలగలిపి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. ఈ సినిమాను ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నాం, ఇందులో అద్భుతమైన నటీనటులు కూడా నటిస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఈ సినిమాకు డేర్‌డెవిల్ ముస్తఫా వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన దర్శకుడు శశాంక్ సొగల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు విడుదలైన పోస్టర్‌లో చాలా వివరాలు దాగి ఉన్నాయి. పైకి చూస్తే ఇదొక సరదా పోస్టర్‌లా అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే దాని వెనుక ఉన్న కథ అర్థమవుతుంది. సినిమా కూడా అంతే. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమాలో ఏదో ఒక విషయం ఆకట్టుకుంటుంది. మొత్తంగా 2026లో ప్రేక్షకులు ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రాన్ని చూస్తారు” అని తెలిపారు. ఈ సినిమాకు నవనీత్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.