భారతీయ సినిమాల్లో మల్టీప్లెక్సులు మొదలై దాదాపు 10 సంవత్సరాలు కావొస్తుంది. సినిమాల స్థాయి, టికెట్ ధరలు, ప్రదర్శనలు, సౌకర్యాలు అన్నీ బాగా పెరిగినా… మల్టీప్లెక్సుల్లో కొన్ని సమస్యలు మాత్రం ఇంకా ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తన వాయిస్ వినిపించారు. ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మల్టీప్లెక్సులకు స్పష్టంగా ఓ విజ్ఞప్తి చేశారు.
“సినిమా స్క్రీనింగ్ జరుగుతున్నప్పుడు ఫుడ్ సర్వ్ చేయకండి. ఒక ముఖ్యమైన సీన్ నడుస్తున్నప్పుడు ఎవరో వచ్చి నా ముందుకు భోజనం పెట్టడం చాలా డిస్టర్బ్ చేస్తుంది. తినాలనుకుంటే సినిమా మొదలు కావడానికి ముందే కొనండి, లేదా ఇంటర్వెల్ సమయంలో కొనండి. కానీ సినిమా మధ్యలో మాత్రం ఎటువంటి మూవ్‌మెంట్ ఉండకూడదు” అంటూ ఆమిర్ చెప్పారు.
అయితే, ఆయనకు సినిమాల్లో ఫుడ్ మీద ఎలాంటి అభ్యంతరం లేదని కూడా క్లారిఫై చేశారు. “పాప్‌కార్న్ అయినా, సమోసాలు అయినా నాకు ఇష్టం. కానీ నేను ఎప్పుడూ సినిమా మొదలు కాకముందు లేదా ఇంటర్వెల్‌లోనే కొనుక్కుంటాను. మధ్యలో మాత్రం డిస్ట్రాక్షన్ వద్దు” అని స్పష్టంచేశారు.
అలాగే ఈ రోజుల్లో ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఆమిర్. “మునుపట్లో ప్రేక్షకులు సినిమాపై పూర్తిగా ఫోకస్ చేసేవారు. నచ్చకపోతే బయటకు వెళ్లిపోవడం తప్ప వేరే దారి ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. సినిమా చూస్తూనే ఫోన్లు చెక్ చేస్తారు. మెసేజులకు రిప్లై ఇస్తారు. సోషల్ మీడియాలో ఎవరు లైక్ పెట్టారో, కామెంట్ చేశారో కూడా చూసేస్తారు” అని అన్నారు.
ఇలా మల్టీప్లెక్సుల్లో ఆహార సర్వీస్, ప్రేక్షకుల అలవాట్లపై ఆమిర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.