సీనియర్ నటుడు శివాజీ… బిగ్‌బాస్ ద్వారా మళ్లీ పాపులారిటీ సంపాదించుకుని, ఆ తరువాత కోర్ట్ సినిమాలో నెగటివ్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘దండోరా’, ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోమవారం రాత్రి జరిగిన ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. గ్లామర్ పేరుతో హద్దులు దాటకూడదని, హీరోయిన్స్ వారి దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శివాజీ సూచించారు.

ముందుగా ఈవెంట్‌కు చీర కట్టుకుని వచ్చిన యాంకర్ ప్రశాంతిని శివాజీ ప్రశంసించారు. ఆమె లుక్‌లోని హుందాతనాన్ని, సంప్రదాయ అందాన్ని కొనియాడారు. ఆ తరువాత సాధారణంగా హీరోయిన్ల దుస్తులపై మాట్లాడుతూ… అందం అనేది శరీరాన్ని బయటపెట్టే దుస్తుల్లో కాదని, హుందాతనం, గౌరవం ఉన్న దుస్తుల్లోనే నిజమైన అందం ఉంటుందని అన్నారు. సంప్రదాయంగా లేదా మర్యాదగా ఉండే దుస్తుల్లోనే మహిళ మరింత అందంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొన్ని సందర్భాల్లో నటీమణులు అనవసరంగా బోల్డ్ దుస్తులు ధరించినప్పుడు, బయటకు నవ్వినా లోపల మాత్రం “ఇంత అవసరమా?” అని చాలామంది అనుకుంటారని శివాజీ అన్నారు. అయితే, ఈ మాటలను మహిళల స్వేచ్ఛకు వ్యతిరేకంగా అర్థం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు.
మహిళ అంటే ప్రకృతి స్వరూపమని, గౌరవం ఆమెకు మరింత విలువను ఇస్తుందని శివాజీ పేర్కొన్నారు. తన తల్లి ఇప్పటికీ తన మనసులో ఒక బలమైన, హుందైన ప్రతిబింబంగా నిలిచిందని చెప్పారు. ఈ తరం మహిళల్లో కూడా ఎంతోమంది గౌరవంగా, అందంగా తమను తాము ప్రదర్శించుకుంటున్నారని అన్నారు. గ్లామర్‌తో పాటు హుందాతనాన్ని సమతుల్యం చేసుకున్న నటీమణులు చరిత్రలో నిలిచిపోయారని ఉదాహరణలు ఇచ్చారు.
గ్లామర్ తప్పు కాదని, కానీ అది ఒక హద్దు వరకు మాత్రమే ఉండాలని శివాజీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా చీర ధరించిన మహిళలే ప్రతిష్టాత్మక బ్యూటీ టైటిల్స్ గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ… సంప్రదాయ దుస్తుల్లోని శక్తి ఎంత గొప్పదో వివరించారు.