అవతార్ franchise కి ఉన్న భారీ హైప్, prequels సాధించిన బాక్సాఫీస్ మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుంటే, జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినీమాటిక్ ఎపిక్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ 2025లో అతిపెద్ద ఓపెనర్‌గా నిలుస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. కానీ విడుదలైన తర్వాత వచ్చిన కలెక్షన్ రిపోర్ట్స్ ఆ అంచనాలను తలకిందులు చేశాయి.
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 137 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ మొత్తం 2025లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలవడానికి సరిపోలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యానిమేషన్ చిత్రం ‘జూటోపియా 2’ తొలి రోజు వసూళ్లను కూడా దాటలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఉత్తర అమెరికాలో ‘అవతార్ 3’కు వచ్చిన మోస్తరు ఓపెనింగ్, అది గ్లోబల్ ఓపెనింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది.
నవంబర్ 26న విడుదలైన ‘జూటోపియా 2’ మాత్రం మొదటి రోజే 150 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనాత్మక ఆరంభాన్ని నమోదు చేసింది. భారీ హైప్ ఉన్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ దీనిని మించి వసూళ్లు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఉత్తర అమెరికాలో సినిమా తొలి రోజు కేవలం 36 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. ఇందులో ప్రీమియర్ షోల నుంచి వచ్చిన స్పందన కూడా పెద్దగా లేకపోవడం ప్రభావం చూపింది. విదేశీ మార్కెట్లలో మాత్రం సినిమా 100 మిలియన్ డాలర్లతో మంచి ఆరంభం సాధించినా, మొత్తంగా చూసుకుంటే ‘జూటోపియా 2’ రికార్డును అధిగమించలేకపోయింది.

ఇక మరింత నిరాశ కలిగించే విషయం ఏమిటంటే, ‘అవతార్’ సిరీస్‌లో రెండో భాగమైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ తొలి రోజు వసూళ్లలో సగం మొత్తాన్ని కూడా ‘ఫైర్ అండ్ యాష్’ సాధించలేకపోయింది. 2022లో విడుదలైన ‘ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 441 మిలియన్ డాలర్లు వసూలు చేసి అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. తొలి రెండు భాగాలు తమ పూర్తి రన్ లో 2 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించగా, ‘ఫైర్ అండ్ యాష్’ కూడా ఆ స్థాయిని చేరుకోవాలంటే భారీ టర్న్ అరౌండ్ అవసరం.
ఇప్పటి నుంచి ఈ సినిమాకు అసలైన పరీక్ష మొదలవుతుంది. సినిమా విజయం పూర్తిగా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆధారపడి ఉంటుంది. వీక్‌డేస్‌లో బలమైన కలెక్షన్లు, రాబోయే క్రిస్మస్ సెలవుల్లో మంచి రన్ అందుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమా 1.5 బిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంటేనే అది ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది.