‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కోసం దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీకి భారతీయులు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం.. కేవలం అందులోని విజువల్స్, టెక్నాలజీ లేదా ఐమాక్స్ (IMAX) స్కేల్ మాత్రమే కాదు; ఆ కథలో అంతర్లీనంగా ఉన్న పక్కా భారతీయ భావోద్వేగాలే అసలు కారణం.

‘అవతార్’ సిరీస్‌లో హీరో జేక్ సల్లి పాత్ర అచ్చం మన భారతీయ కుటుంబ పెద్దల తరహాలోనే ఉంటుంది. కుటుంబానికి అండగా నిలబడటం, పిల్లల రక్షణే పరమావధిగా బతకడం, నైతిక విలువలు, త్యాగనిరతి… ఇవన్నీ ఆయన పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక నేటిరి విషయానికి వస్తే — ఆమె ఒక తల్లిగా, యోధురాలిగా ఇంటికి దొరికిన బలం. కుటుంబం కోసం దేన్నైనా ఎదిరించే ఆమె పాత్ర, మన సంస్కృతిలోని శక్తివంతమైన స్త్రీ మూర్తికి నిలువుటద్దంలా అనిపిస్తుంది.
సల్లి కుటుంబంలోని అన్నదమ్ముల (నెటేయమ్–లో’ఆక్) అనుబంధం కూడా మన ‘దేశీ’ కథలను గుర్తుచేస్తుంది. బాధ్యత, భావోద్వేగాల మధ్య నలిగిపోయే అన్నదమ్ములు, తల్లిదండ్రుల నీడలో పెరిగే పిల్లలు… ఈ ట్రాక్ అంతా మన ఇక్కడి ఫ్యామిలీ డ్రామాలను తలపిస్తుంది. పాండోరా గ్రహం కోసం నావీ జాతి మొత్తం ఏకం కావడం—మన కథల్లోని ‘మన మట్టి, మన మనుషులు’ అనే భావనకు భారీ రూపంలా అనిపిస్తుంది. ఇక పాండోరాను నడిపే ఆధ్యాత్మిక శక్తి ‘ఐవా’ (Eywa), మనం ప్రకృతిని దైవంగా ఆరాధించే విధానానికి ఎంతో దగ్గరగా ఉంటుంది.
జేమ్స్ కామెరూన్ సినిమాలు ఎప్పుడూ యాక్షన్‌తో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను మిళితం చేస్తాయి. బ్రదర్హుడ్, త్యాగం, స్నేహం, కుటుంబ బంధాలు… ఇవే అవతార్ కథలకు అసలైన బలం. అందుకే ఈ ఫ్రాంచైజ్‌లో మనకు తెలియకుండానే ఒక “ఇండియన్ కనెక్షన్” కనిపిస్తూనే ఉంటుంది. ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.