ఇటీవలి కాలంలో ప్రేక్షకులు సినిమాను చూసే విధానంలో పెద్ద మార్పు వచ్చింది. IMAX, Dolby Cinema, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్లపై ఆసక్తి పెరిగింది. ఎక్కువ టికెట్ ధర చెల్లిస్తున్న ప్రేక్షకులు కూడా ఆ స్థాయిలో ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ని కోరుకుంటున్నారు. కానీ అలాంటి పెద్ద స్థాయి టెక్నికల్ డెలివరీ ప్రతి దర్శకుడికి సులభం కాదు, ముఖ్యంగా పాన్-ఇండియా స్థాయి సినిమాలకి.
ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌కి (2027) సన్నద్ధమవుతున్న ఎస్.ఎస్.రాజమౌళి, తన మైలురాయి చిత్రం బాహుబలిని ఒక కొత్త రూపంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. బాహుబలి: ది ఎపిక్ పేరుతో రాబోతున్న ఈ చిత్రం, రెండు భాగాలను కలిపి, కొత్తగా సింగిల్ మూవీగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వెర్షన్ ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత విజువల్‌గా అద్భుతమైనదిగా ఉండబోతోందని మేకర్స్ హామీ ఇచ్చారు. బాహుబలి రిలీజ్ అయ్యి పది ఏళ్ళు అయ్యింది కాబట్టి, ఇంతలా గ్రాండ్ రి-రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు…
ఈ సినిమా IMAX, Dolby Cinema, 4DX, DBox, EpiQ, ICE, ఇంకా PCX వంటి పలు ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ స్థాయిలో టెక్నికల్ ఫార్మాట్లలో ఒకే సమయంలో విడుదల అవ్వడం పాన్-ఇండియా సినిమాలకు చాలా అరుదు.
ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా ఈ విషయంలో సాంకేతిక సవాళ్లను వివరించారు. ఆయన ట్వీట్ చేస్తూ — “ఈరోజుల్లో మల్టీ ఫార్మాట్లు, అనేక భాషలు, ప్రపంచవ్యాప్త విడుదలలతో కంటెంట్ డెలివరీ ఒక పెద్ద లాజిస్టికల్ ఎక్సర్సైజ్‌గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అన్ని ఫార్మాట్ల డెలివరీలు, టైమ్‌లైన్‌లు సమీక్షిస్తున్నాం. అన్ని భాగస్వాములకు సమయానికి కంటెంట్ అందేలా చూసుకుంటున్నాం” అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించారు. సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు. నిర్మాణం శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా చేశారు.