బ్రహ్మానందం – భారతీయ సినీ రంగంలో హాస్యానికి అగ్రగామి. అనేక వందల సినిమాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఆయన, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – ఆయన బాలీవుడ్‌లో చాలా తక్కువగా కనిపించారు. ఎందుకు అలా జరిగిందో చాలామందికి తెలియదు. కానీ, తాజాగా తన ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా స్వయంగా ఆ రహస్యాన్ని బయట పెట్టారు.
ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదలైన తన ఆత్మకథ ప్రారంభోత్సవంలో బ్రహ్మానందం మాట్లాడుతూ, “హిందీ సినిమాలు ఎందుకు చేయలేదని చాలామంది అడుగుతుంటారు. దానికి ప్రధాన కారణం భాషా సమస్య. కామెడీ అంటే కేవలం సంభాషణలతో కాదండి, అందులో టైమింగ్, డిక్షన్, సున్నితమైన హావభావాలు ఎంతో ముఖ్యం. హిందీ నా మాతృభాష కాదు. అందుకే నేను హిందీలో చేస్తే, తెలుగు సినిమాల్లో చేసేంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేననే భావన నాలో ఉంది” అని candidగా చెప్పారు.
‘నేను మీ బ్రహ్మానందం’ అనే పేరుతో ఆయన ఆత్మకథ తెలుగు సహా ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం ద్వారా తన జీవితం, తన ప్రయాణం, సినీ రంగంలోని అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్న బ్రహ్మానందం, మరోసారి ఎందుకు ఆయనను ‘కామెడీ కింగ్’ అని పిలుస్తారో నిరూపించారు.