ఇటీవలి కాలంలో ఓటీటీ కంటెంట్‌పై, దానికి ఉండాల్సిన సెన్సార్ విధానంపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగిస్తున్న భాష, విజువల్ స్టోరీటెల్లింగ్ విధానాలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడంతో, నియంత్రణ అవసరమనే డిమాండ్ వేగంగా పెరిగింది.
ఒక దశలో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న మొత్తం కంటెంట్ కూడా సీబీఎఫ్‌సీ (CBFC) పరిధిలోకి రావచ్చని వార్తలు వినిపించాయి. దీంతో ఓటీటీ రంగంపై పూర్తిస్థాయి సెన్సార్ విధానం అమలవుతుందనే అభిప్రాయం కూడా ఏర్పడింది.
అయితే తాజా పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సీబీఎఫ్‌సీ అధికారికంగా, ఓటీటీ కంటెంట్‌ను తాము సర్టిఫై చేయబోమని, అలాగే పరీక్షించబోమని స్పష్టంగా వెల్లడించింది.
ఓటీటీ కంటెంట్ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్, 2021 (IT Rules 2021) లోని పార్ట్–III నిబంధనల ప్రకారం నియంత్రించబడుతోందని తెలియజేశారు. ఈ ఎథిక్స్ కోడ్ ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రచురించకూడదని, అలాగే వయస్సు ఆధారిత కేటగిరీల ప్రకారం కంటెంట్‌ను వర్గీకరించాల్సిన బాధ్యత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లదే.
అలాగే ఈ నిబంధనలలో, కంటెంట్ సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పర్యవేక్షించడానికి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడు స్థాయిల వ్యవస్థను కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
ఆ మూడు స్థాయిలు ఇలా ఉన్నాయి:
స్థాయి–1: కంటెంట్‌ను విడుదల చేసే ప్రచురణకర్తలే స్వయంగా నియంత్రణ పాటించాలి.
స్థాయి–2: ప్రచురణకర్తలు ఏర్పాటు చేసిన స్వీయ నియంత్రణ సంస్థల ద్వారా పర్యవేక్షణ.
స్థాయి–3: కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ.
ఈ విధానం ప్రకారం, భారతదేశంలో స్ట్రీమ్ అయ్యే ఓటీటీ కంటెంట్ స్థానిక సెన్సార్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చూసుకోవడం పూర్తిగా ప్రచురణకర్తల బాధ్యత. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, ఆ కంటెంట్ వల్ల కలిగే పరిణామాలకు సంబంధిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌నే బాధ్యత వహించాల్సి ఉంటుంది.