తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో నిన్న తెలుగు సినిమా కార్మిక సంఘ సభ్యులకు భేటీ అయ్యారు. “ఎప్పటినుంచో ఫెడరేషన్ సభ్యులను కలవాలని అనుకున్నారు కానీ ఈ రోజు కొంత సమయం కేటాయించారు” అని ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు దర్శకుడు వీరశంకర్ తెలిపారు. 13 యూనియన్ల సభ్యులను సమావేశానికి ఆహ్వానించారని ఆయన వెల్లడించారు. రోజువారీ వేతనాలు పొందే కార్మికులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సానుకూలంగా ముగిసిన ఈ సమావేశం తరువాత కార్మికులలో ఉత్సాహం నెలకొంది.
వాస్తవానికి, సీఎం స్వయంగా జోక్యం చేసుకోవడంతో 18 రోజులుగా సాగిన సమ్మెకు ముగింపు లభించింది. దీంతో వేలాది మంది కార్మికులు తిరిగి పనిలో చేరారు. రోజుకు రూ.2000 కంటే తక్కువ వేతనం పొందుతున్న వారికి 15% పెంపు అమలు చేయగా, రూ.2000 నుంచి రూ.5000 వరకు వేతనం పొందుతున్న వారికి 7.5% పెంపు అమలు చేశారు. మిగతా పెంపు రెండు సంవత్సరాల్లో అమలు చేయనున్నారు.
అలాగే, ప్రభుత్వం అధికారులతో పాటు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. ఆ కమిటీ రూపకల్పనకు ముందు ఫెడరేషన్ సభ్యులతో మరోసారి సమావేశమవుతానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

గతంలో, సీఎం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమై తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయి ఇమేజ్ తీసుకురావడం కోసం హైదరాబాద్‌ను ప్రపంచ సినీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను చర్చించారు.
ఆ భేటీ లోని ముఖ్యమైన అంశాలు గురించి తెలుసుకుందాం:
- సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో, హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న…
- ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమీ కావాలో చర్చించుకుని చెప్పండి.
- సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పాను.
- సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరాను.
- స్కిల్ యూనివర్సిటీ లో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం.
- సినిమా కార్మికులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి.
- అన్ని భాషల చిత్రాలు తెలంగాణ లో షూటింగ్ జరిగేలా సహకరించాలి.
- చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి.
- పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దు.
- సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది.
- సమస్యను సమస్యగానే చూస్తా, వ్యక్తిగత పరిచయాలను చూసుకోను.
- సినిమా కార్మికుల తరుపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.
- ఈ ప్రభుత్వం మీది… మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది.
- నేను కార్మికుల వైపు ఉంటాను..అదే సమయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం.
- సమ్మె జరుగుతుంటే చూస్తూ ఉర్కోలేం.
- సినిమా కార్మికుల కు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం..
- సినీ కళాకారులకు గద్దర్ అవార్డ్ లను ఇచ్చాం.
- 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డు లు కూడా ఇవ్వలేదు..
- ఇన్నీ ఏళ్లలో సినిమా కార్మికుల ను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరన్న సంఘాల నాయకులు.